బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం సెంట్రల్ ఫీలిప్పీన్స్లోని మనీలాలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఇందులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
స్థానిక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇలోయిల్ ప్రాంతం నుంచి వెళ్తున్న ఓ బస్సు పర్వత ప్రాంతాల సమీపంలోకి రాగానే మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. కంట్రోల్ చేసేలోగా ఆ బస్సు కాంక్రీటు రెయిలింగ్‌కు ఢీకొట్టి లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులతో పాటు ఆర్మీ, అత్యవసర ప్రతిస్పందన బృందాలు కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగించినట్లు స్థానిక అధికారి తెలిపారు. లోయలో దట్టమైన చెట్లు ఉండటం వల్ల రెస్క్యూ ఆలస్యమైందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. మృతుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.