అగ్రిగోల్డ్ బాధితులకు అండగా జగన్ ప్రభుత్వం..!

-

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పలు సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొచ్చారు. ఇక ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగానే తొలుత పదివేల లోపు డిపాజిటర్లకు ప్రభుత్వమే నేరుగా సొమ్ము చెల్లించింది. తాజాగా అగ్రి గోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే క్రమంలో మరో ముందడుగు వేసింది.

jagan

ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం.. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్లు రూ.263.99 కోట్ల మేర చెల్లించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించేందుకు తెలంగాణ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. దీంతో మరోమారు డిపాజిట్ల చెల్లింపునకు ప్రభుత్వానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సీఐడీ సేకరిస్తుందని తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఇక డిపాజిట్‌దారుల వివరాలను గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా సీఐడీ సేకరిస్తుందన్నారు. సేకరించిన డిపాజిట్‌దారుల వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారని ఏజీ శ్రీరామ్ తెలంగాణ హైకోర్టుకు వివరించారు. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చేత దరఖాస్తులను ధృవీకరింస్తారు. అనంతరం కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్ల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

కాగా, మార్చి 31 కల్లా డబ్బు చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు తెలిపింది. కాగా, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంపై తమ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆంధ్ర బ్యాంకు, ఎస్‌బీఐలు తెలంగాణ హైకోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. దీనిపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ (సీజే) నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version