ఆంధ్రప్రదేశ్ లో వరుస సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు సిఎం వైఎస్ జగన్. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే ఆయన మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఒక పక్క కరోనా ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్… ఇప్పుడు విద్యార్ధుల కోసం మరో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఇప్పటికే వారి కోసం పలు కార్యక్రమాలు మొదలుపెట్టారు.
జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు ప్రవేశపెట్టిన జగన్ సర్కారు నేడు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒకేసారి అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పింది.
ఈ పథకం ద్వారా 12 లక్షల మంది తల్లులు, వారి పిల్లలు లబ్ధి పొందుతారని పేర్కొంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్ని త్రైమాసికాలకు సంబంధించి చెల్లించవలిసిన ఫీజులు బకాయిలు లేకుండా ఒకే ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తుంది సర్కార్. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తల్లులకు, వారి పిల్లల చదువుల కోసం కేవలం 11 నెలల కాలంలోనే దాదాపు రూ.12 వేల కోట్లు ప్రభుత్వం అందించనుంది. గత ప్రభుత్వ బకాయిలు రూ. 1,880 కోట్ల బకాయిలు కూడా చెల్లిస్తారు. ఇందుకోసం 4 వేల కోట్లను విడుదల చేస్తారు.