జయహో భారత్: ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్‌ సారాబాయ్‌ గురించి కొన్ని విశేషాలు..!

-

అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన వారెంతో మంది ఉన్నారు. దేశం గర్వపడేలా చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు.. వారిలో విక్రం సారాబాయి ప్రథముడు. భౌతిక శాస్త్రవేత్తలో ప్రావీణ్యం పొందిన ఈయన.. అంతరిక్ష పరిశోధన వ్యవస్థను స్థాపించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశం గర్వించదగ్గ వీరుల గురించి ఎంతోకొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
జీవిత చరిత్ర :
1919 ఆగస్టు 12న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో అంబాలాల్, సరళా దేవి దంపతులకు ఎనిమిదవ సంతానంగా విక్రం సారాభాయి జన్మించాడు. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడం వల్ల వీరి ఇంటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటీ ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారట. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేశారు..
విక్రమ్ సారాభాయి అహమ్మదాబాదులోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసుకుని… పై చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1940వ సంవత్సరంలో అక్కడ నాచురల్ సైన్సెస్‌లో, ట్రిపోస్‌లో ఉత్తీర్ణత సాధించారు.. ఆ క్రమంలోనే రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావటంతో ఆయన దేశానికి తిరిగివచ్చి.. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సర్ సీ.వీ.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలుపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1945వ సంవత్సరంలో తిరిగి కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లి పీహెచ్‌డీ పట్టాను సాధించుకుని.. 1947లో తిరిగి భారత్ వచ్చేశారు.
స్పుత్నిక్‌ ప్రయోగం తర్వాత మొదలైన ప్రయాణం..
1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు.. భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి, దాని ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూకు విక్రమ్‌ వివరించించారు. అలాంటిదాన్ని భారత్ లోనూ ఏర్పాటు చేద్దామని విక్రం ఆయన్ను ఒప్పించారు. 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్) సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించటం విక్రమ్ సారాభాయ్ వ్యూహంలో ప్రధానంగా ఉండేది.
సాంకేతిక పరిజ్ఞానంతోనే సమస్యల పరిష్కారం..
సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని.. అప్పుడే దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవారు. ‘భారత అంతరిక్ష రంగ పితామహుడు’గా కీర్తి గడించిన సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. ఈయన 1971, డిసెంబరు 31న తేదీన తుదిశ్వాస విడిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version