టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజాగా నిర్వహించిన 5జి ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. ఆ కంపెనీ తన 5జి నెట్‌వర్క్‌పై ఏకంగా 1 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను సాధించింది. రిలయన్స్ జియోలో చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జియో, క్వాల్‌కామ్ సంస్థలు రెండూ కలిసి భారత్‌లో 5జి ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నాయి.
క్వాల్‌కామ్ సంస్థతో కలిసి జియో భారత్‌లో 5జి కోసం కావల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా 5జి నెట్‌వర్క్ ట్రయల్స్‌ను జియో నిర్వహించింది. ఆ ట్రయల్స్‌లో జియో నెట్‌వర్క్ ఏకంగా 1 జీబీపీఎస్ స్పీడ్‌ను సాధించడం విశేషం. దీంతో జియో నుంచి 5జి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా జియో ఇటీవలే కేవలం రూ.3వేలకే 5జి ఫోన్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించిన విషయం విదితమే. దీంతో తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న షియోమీ, రియల్‌మి తదితర కంపెనీలకు త్వరలో జియో నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక 1 జీబీపీఎస్ స్పీడ్ అంటే 4 నిమిషాల నిడివి గల ఒక పాటను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కేవలం 0.03 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. అదే 5 నిమిషాల వీడియో డౌన్‌లోడ్‌కు 0.2 సెకన్లు, 9 గంటల ఆడియో బుక్ డౌన్‌లోడ్‌కు 0.9 సెకన్లు, 45 నిమిషాల హెచ్‌డీ వీడియో డౌన్‌లోడ్‌కు 5 సెకన్లు, 2 గంటల హెచ్‌డీ వీడియోకు 25 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. అంటే.. దాదాపుగా 1 నిమిషంలోనే ఫుల్ హెచ్‌డీ సినిమాను డౌన్‌లోడ్ చేయవచ్చన్నమాట. మరి 5జి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.