ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్, ఓ శస్త్రచికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరనున్నారు. ఆయన కాలులో వున్న ఇంప్లాంట్‌ను తొలగించేందుకు వైద్యులు శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్ఎం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2016 లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగినపుడు వైద్యులు ఇంప్లాంట్‌ను అమర్చారని, దీన్ని తొలగించాల్సి అవసరం ఉందని తెలిపారు.
అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారని ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్ మహేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుల సలహా మేరకు రేపు (నవంబర్ 22) కమల్ హాసన్ ఇందుకోసం ఆసుపత్రిలో చేరనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కోలుకునేందుకు కొన్ని వారాలు పాటు విరామం తీసుకోవాల్సి వుంటుందని మహేంద్రన్ వెల్లడించారు.