కమలంలో కన్నా తిరుగుబాటు..సోముతోనే డ్యామేజ్!

-

ఓ వైపు వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపై అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. దీంతో సీఎం జగన్ క్రమశిక్షణ చర్యలకు దిగుతున్నారు. ఇటు వైసీపీలోనే కాదు..అటు ఏపీ బీజేపీలో కూడా తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిపై కొందరు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సోము ముందు నుంచి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..సోము తీరుపై ముందు నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా సోముపై తిరుగుబాటు చేశారు.  తాజాగా సోము ఎవరిని సంప్రదించకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు.

అసలు కోర్ కమిటిలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని అన్నారు. అధ్యక్షుల మార్పు తనతో చర్చించలేదని, ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లే అని అన్నారు. ఇక తాను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో జాయిన్ చేశానని, ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల కొందరు ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. అందులో కన్నా బంధువులు కూడా ఉన్నారు. దీంతో తన బంధువు సైతం బీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరాడో సోము వీర్రాజును అడగాలని అన్నారు.

అటు ఎంపీ జీవీఎల్ ఆలోచన స్థానిక బీజేపీ కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుందని అన్నారు. అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవీఎల్ వైఖరి చూశాం. ఒన్ షాట్ టూ బర్డ్స్‌గా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని, పవన్‌కు తామంతా అండగా ఉంటామని, కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. మొత్తానికి కన్నా..సోముని గట్టిగా టార్గెట్ చేశారు. అయితే టీడీపీతో బీజేపీ పొత్తు లేకపోతే..కన్నా బీజేపీని వీడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version