కాంగ్రెస్ పార్టీ చలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఆ జాతీయ పార్టీకి.. జాతీయ విధానమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్రానికో విధానంతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం, అధికారంలో లేని చోట మరో విధానాన్ని అవలంభిస్తోందన్నారు.
దేశ రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీ కాంగ్రెస్ అని ప్రభాకర్ అభివర్ణించారు. కాంగ్రెస్ నేర్పిన రాజకీయాన్ని ఇవాళ దేశంలో బీజేపీ చేస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పాలన వచ్చే వరకు గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసిన కాంగ్రెస్.. రాజ్‌భవన్ ముట్టడించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని రాష్ట్రపతి పాలన విధించాలని అసంబద్ధ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాజస్థాన్‌లో వారి ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తున్నారన్నారు. కరోనా ప్రభావంతో పండగలను సైతం ప్రజలు పక్కకు పెడితే.. ఆ పార్టీ కొవిడ్ నిబంధనలను బ్రేక్ చేస్తోందని విమర్శించారు. ఇదెక్కడి నీతి అంటూ ప్రశ్నించారు.