ప్రజల దీవెనలతో కేసీఆర్ త‌ప్పకుండా హ్యాట్రిక్ సీఎం అవుతారు : కవిత

-

కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫ‌ల్యాలే బీఆర్‌ఎస్‌ విజ‌యానికి సోపానాలు అని క‌విత పేర్కొన్నారు. ప్రజల దీవెనలతో కేసీఆర్ త‌ప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతార‌ని ఆమె విశ్వాసం వ్య‌క్తం చేశారు. నిజామాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో క‌విత మాట్లాడారు. కాంగ్రెస్‌లో గ్రూపులే త‌మ పార్టీ విజ‌యానికి కార‌ణ‌మ‌వుతాయ‌ని క‌విత పేర్కొన్నారు.

ఆస్తులు అమ్ముకోవ‌డం కాంగ్రెస్ నైజం అని ధ్వ‌జ‌మెత్తారు. ఆర్టీసీ అభివృద్ధి కోస‌మే ప్ర‌భుత్వంలో విలీనం చేశాం. కానీ ఆర్టీసీ విలీనాన్ని కాంగ్రెస్ పార్టీ వివాదం చేస్తుంద‌ని మండిప‌డ్డారు. సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణంపై కూడా కాంగ్రెస్ వివాదం చేసింది. నేల‌మాళిగ‌లు, గుప్తా నిధుల కోసం స‌చివాల‌యం క‌డుతున్నామ‌ని ఆ పార్టీ నాయ‌కులు అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం విష‌యంలోనూ ఆస్తుల కోసం అంటూ ఆగ‌మాగం చేస్తున్నార‌ని క‌విత తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

రుణ‌మాఫీ త‌మ ఎన్నిక‌ల ఎజెండా.. ఇది కాంగ్రెస్ విజ‌యం అన‌డం హాస్యాస్ప‌దం అని క‌విత అన్నారు. రుణ‌మాఫీ కాంగ్రెస్ విజ‌యం కాదు.. కానీ మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావ‌డం మాత్రం కాంగ్రెస్ విజ‌య‌మే అని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడైనా, ఏ ప‌ని అయినా బాజాప్తా చెప్పి చేస్తారు. రూ. 19 వేల కోట్ల నిధుల‌తో 35 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రుణ‌మాఫీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌వి అర్థం లేని ఆరోప‌ణ‌లు అని క‌విత ధ్వ‌జ‌మెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version