ప్రభుత్వ లైసెన్సులు ఇచ్చే అన్ని షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇచ్చామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇటీవలే మార్గదర్శకాలు వచ్చాయన్నారు. ఇక మీదట మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చే అన్ని షాపుల్లో కూడా దళితులకు ఇక మీదట రిజర్వేషన్లు అమలు చేస్తాం అన్నారు.
దళిత బంధు దేశంలో, ప్రపంచంలోనే అద్భుత పథకం అని కేసీఆర్ అన్నారు. మీ మొహానికి మీ పాలించే రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి పథకం ఉందా ..? అని బీజేపీని ప్రశ్నించారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పూర్తిగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే రూ. 2 వేల కోట్లు విడుదల చేశాం అన్నారు. మరో నాలుగు మండలాల్లో కూడా అమలు చేస్తాం. మార్చిలోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని వంద మంది లబ్ధిదారులకు పథకాన్ని అమలు చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంఘం రూ.20 వేల కోట్లతో పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం అన్నారు. రానున్న రెండేళ్లలో 4-5 లక్షల కుటుంబాలకు పథకాన్ని అందిస్తామన్నారు.