జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర మొదలుకానున్న విషయం తెలిసిందే. కుప్పంలో మొదలుకానున్న పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు కొనసాగి చివరికి ఇచ్చాపురంలో ముగియనుంది. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లని టీడీపీ శ్రేణులు పర్యవేక్షిస్తున్నాయి. ఇక యువ నేతలతో పాటు సీనియర్ నేతలు కూడా లోకేష్ పాదయాత్రకు మద్ధతుగా ఉన్నారు. కుప్పంలో మొదట రోజు రాష్ట్రం వ్యాప్తంగా టీడీపీ నేతలు రానున్నారు.
అయితే ఇప్పటికే పాదయాత్ర ఏర్పాట్లని పూర్తి చేసే పనిలో ఉన్న టీడీపీ..తాజాగా రూట్ మ్యాప్‌ని విడుదల చేసింది. ఈ రూట్ మ్యాప్‌లో ఆసక్తికరమైన అంశాలు కొన్ని చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎక్కడైతే వీక్ గా ఉందో ఆ స్థానాల్లోనే ఎక్కువ రోజులు పాదయాత్ర ఉండనుంది. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఎక్కువ రోజులు పాదయాత్ర కొనసాగనుంది.
ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి..ఆ 14 స్థానాలు కవర్ అయ్యేలా పాదయాత్ర సాగనుంది. అలాగే మిగిలిన మూడు జిల్లాల్లోని స్థానాలని కూడా కవర్ చేయనున్నారు. ఇక టీడీపీ బలంగా ఉన్న గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్తానాల్లో పాదయాత్ర లేదు. ఇదిలా ఉంటే ఇక్కడొక ట్విస్ట్ ఏంటంటే…ఈ రూట్ మ్యాప్‌లో ఏవైతే పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు ఇస్తారనే ప్రచారం ఉందో..ఆ సీట్లలో లోకేష్ పాదయాత్ర లేదు.
ఉదాహరణకు పశ్చిమ గోదావరిలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం సీట్లు జనసేనకు ఇస్తారని ప్రచారం ఉంది. ఆ సీట్లలో లోకేష్ పాదయాత్ర లేదు. ఇక తూర్పు గోదావరిలో రాజోలు, అమలాపురం, రాజానగరం, ముమ్మిడివరం లాంటి సీట్లు జనసేనకు ఇస్తారని ప్రచారం ఉంది. ఆ సీట్లలో లోకేష్ పాదయాత్ర లేదు. ఇక జనసేనకు ఇస్తారనే కొన్ని సీట్లలో పాదయాత్ర ఉంది. మొత్తానికి లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఆసక్తికరంగా ఉంది.