మ్యాజిక్ రైస్.. ఈ బియ్యాన్ని వండకుండానే తినేయొచ్చు..!!

-

ఎహె.. పొద్దుపొద్దుగాలనే చెవిలో బియ్యం పెట్టకండి అంటారా? వండకుండా ఉత్త బియ్యాన్ని బుక్కమంటారా? అంటూ కొప్పడకండి. కాస్త మేం చెప్పేది వినండి.. సరే.. సరే.. చెప్పు.. అంటారా.. పదండి.. తెలుసుకుందాం.

వండకుండానే నీటిలో నానబెట్టుకొని తినే బియ్యాన్ని అస్సాం రైతులు పండిస్తున్నారు. అంటే బియ్యాన్ని ఓ గంట పాటు నీళ్లలో నానబెడితే చాలు. ఇక.. ఏంచక్కా కూరలో కలుపుకొని ఆ అన్నాన్ని లాగించేయొచ్చన్నమాట. అరె.. ఇదేదో బాగుందే. గ్యాస్ బాధ ఉండదు. దాన్ని వండే బాధ తప్పుతుంది. సూపర్ ఐడియా అంటారా? అవును సూపర్ ఐడియానే. వీటిని బోకా సౌల్ అని పిలుస్తారట. ఇప్పుడు కాదు.. ఈ బియ్యాన్ని అస్సాంలో ఎప్పటి నుంచో పండిస్తున్నారట. కాని.. మనకు ఇప్పుడు తెలిసింది.

అయితే.. ఈ బియ్యానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ దక్కిందట. ఏంటి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటారా? తెలుగులో భౌగోళిక గుర్తింపు అంటారు. లేదా జీఐ అన్నా ఓకే. భౌగోళిక మూలాలు ఉన్న పదార్థాలకు ఈ గుర్తింపు లభిస్తుంది. అవి ఆ ప్రాంత మూలాలను దశదిశలా వ్యాప్తింపజేస్తే ఈ గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు ఈ బియ్యానికి లభించడంతో ఇప్పుడు అందరూ దీని గురించే చర్చిస్తున్నారు.

అస్సాంలోని మారుమూల ప్రాంతాల్లో ఈ బోకా సౌల్ ను పండిస్తుంటారు. జూన్ నుంచి డిసెంబర్ కాలంలో పండిస్తారు. వీటిని మడ్ రైస్ అని కూడా అంటారు. మరో వైపు ఈ బియ్యంలో పోషక విలువలు కూడా పుష్కలం. గౌహతి యూనివర్సిటీ రీసెర్చర్స్ ఈ బియ్యంపై పరిశోధన చేశారు. సౌల్ బియ్యంలో 10.93 శాతం పీచు పదార్థం, 6.8 శాతం మాంసకృత్తులు ఉన్నాయట. ఇక.. సహజ సిద్ధంగా వీటిని పండించడం వల్ల వీటి వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని రీసెర్చర్స్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. కాకపోతే ఈ బియ్యం కాస్త దొడ్డుగా ఉంటాయి. అంతే కాని.. ప్రస్తుతం మార్కెట్ లో దొరికే బియ్యం కంటే ఇవి వంద రెట్లు నయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version