రెండు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి…అనూహ్యంగా ప్రతిపక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతున్నాయి. మొదట తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ స్థానం గురించి మాట్లాడుకుంటే…అక్కడ బిజేపి బలపర్చిన అభ్యర్ధి గెలవడం సంచలనంగా మారింది. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ కారణంగా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా విజయం సాధించారు.
కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఊహించని విధంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఏవీఎన్ రెడ్డి విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి అయిన గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో ఇక్కడ బిఆర్‌ఎస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లు అయింది.
ఇక ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ హవా కొనసాగింది గాని..పట్టభద్రుల స్థానంలో వైసీపీకి షాక్ తగిలేలా ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో 4 ముందే వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. 4 స్థానాలకు ఎన్నికలకు జరగగా వైసీపీ విజయం సాధించింది. తూర్పు, పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.
కానీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టిడిపి గెలుపు దిశగా వెళుతుంది. నాలుగు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు 18371 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ భారీ ఆధిక్యంగా దూసుకువెళ్తోంది. అక్కడ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 16 వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1900 ఆధిక్యంలో ఉన్నారు.