అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో సుమారు 60 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎమ్ఈ పార్కుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనకాపల్లిని పారిశ్రామిక రంగంలో మొట్టమొదటి స్థానంలో నిలుపుతానని వెల్లడించారు. గత ప్రభుత్వాలు అనకాపల్లి అభివృద్ధిని పట్టించుకోలేదని, వేల ఎకరాల ప్రభుత్వ స్థలం వున్నా, పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేయలేకపోయాయని అమర్నాథ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అనకాపల్లిలో ఎంఎస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని.. తాను పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంఎస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి మరింత ప్రోత్సాహం అందించారని తెలియజేశారు అమర్నాథ్. పార్క్ లో 200 ఫ్లాట్లు ఏర్పాటు చేయడానికి విఎంఆర్డిఏ నుంచి త్వరలోనే అనుమతులు లభించనున్నాయని తెలియజేశారు అమర్నాథ్.
ఎంఎస్ఎమ్ఈ పార్క్ ను జాతీయ రహదారులకు అనుసంధానం చేసేందుకు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలియజేశారు అమర్నాథ్. ఎంఎస్ఎమ్ఈ పార్కుకు ఆనుకునే మరో 70 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు అమర్నాథ్ తెలిపారు. 1978 లో మా తాతగారు గుడివాడ అప్పన్న గాజువాకలో ఆటోనగర్ ఏర్పాటుకు పునాది వేశారని ఇప్పుడు నేను కోడూరులో ఎంఎస్ఎమ్ఈ పార్కు శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలో ఎంఎస్ఎమ్ఈలకు చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఇందులో భాగంగానే 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెస్ఎంఈలకు రావలసిన ఇన్సెంటివ్ లను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారని వెల్లడించారు అమర్నాథ్.