టీఆర్‌ఎస్‌ హయాంలో 6 వేల ఐసీయూ బెడ్లు : హరీష్ రావు

-

హైదరాబాద్‌ అమీర్‌పేటలోని 50 పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో 200 ఐసీయూ బెడ్లు మాత్రమే ఉండేవన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో 6 వేల ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాంగ్రెస్‌ మాటల పార్టీ, టీఆర్‌ఎస్‌ అంటే చేతల పార్టీ అని హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వ దవాఖానలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు మంత్రి హరీష్‌ రావు.

ప్రభుత్వ దవాఖానలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. దవాఖానలపై గీతారెడ్డి అవాస్తవాలు మాట్లాడారని చెప్పారు. ఒక్కసారి జహీరాబాద్‌ దవాఖానకు వెళ్లి చూస్తే ప్రభుత్వ హాస్పిటళ్లలో వసతులు ఎలా ఉన్నాయో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఐసీయూలు పెట్టాలని, జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. వారు 70 ఏండ్లలో మూడు మెడికల్‌ కాలేజీలు తీసుకొస్తే, తాము మాత్రం 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version