అడిగింది ఇచ్చే వరకు ఎమ్మెల్యే గంటా వైసీపీలోకి రారా?

-

రాజకీయాల్లో ఎవరు.. ఎప్పుడు ఎటువైపు ఉంటారో చెప్పడం కష్టం. గంటా శ్రీనివాసరావు మాత్రం ప్రస్తుతం టీడీపీలో ఉన్నా.. ఆయన మనసు మాత్రం మరేదో కోరుకుంటోంది. ఆ కోరిక తీరినట్టే అనిపిస్తుంది కానీ.. తీరదు. అందని ద్రాక్షాలా మారింది ఆయన ఆశల తీరు. ఏడాదిన్నరగా ఇదే తంతు. అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేనే అయినా.. సైకిల్‌ తొక్కడానికి ఇష్టపడటం లేదు. ఆయన మూడ్‌ గ్రహించిన టీడీపీ అధిష్ఠానం సైతం పార్టీ పదవుల్లో ఎక్కడా చోటు కల్పించలేదు. అయినా ఎలాంటి బాధ లేదు. టీడీపీ కార్యక్రమాలకు రారు.. పార్టీ నిర్వహించే ఆందోళనలకు దూరంగా ఉంటారు. అసెంబ్లీకి వచ్చినా తనది ఇంకో పక్షం అన్నట్టు చూస్తూ కూర్చుంటారు.

ఏడాదిన్నరగా మౌనంగా ఉన్న గంటా శ్రీనివాసరావు.. ఈ మధ్య తిరుమల వెళ్లినప్పుడు మాత్రం అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఓ కామెంట్‌ చేశారు. సభలో సభ్యులు గౌరవంగా ఉండాలి. హద్దు మీరకూడదు అని సలహా ఇచ్చారు. నిజమే.. గంటా చెప్పిన సూక్తులు బాగానే ఉన్నాయని చెవులు కొరుక్కున్నాయి రాజకీయవర్గాలు. అయితే సూక్తులు చెప్పి ఊరుకుంటారా? లేక సభకు వచ్చేది ఏమైనా ఉందా అన్న సెటైర్లు వినిపించాయి. పనిలో పనిగా ఎప్పటి నుంచో సాగుతున్న గంటా ప్రయత్నాలు మళ్లీ చర్చలోకి వచ్చాయి.

గంటా టీడీపీలోనే ఉన్నారా? వైసీపీలోకి వెళ్తారా అన్న ప్రశ్నలు జోరందుకున్నాయి. గంటా వైసీపీలోకి వెళ్తారని ఇప్పటికే అనేక ముహూర్తాలు కాలగర్భంలో కలిసిపోయాయి. వైసీపీలోని ఆయన సన్నిహితులు చేసిన ప్రయత్నాలు మూడు అడుగులు ముందుకి.. ఆరగడులు వెనక్కి అన్నట్టు ఉన్నాయి. గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఒకప్పటి ఆయన శిష్యుడు మంత్రి అవంతి శ్రీనివాస్‌. మరి.. ఏ అదృశ్య శక్తి ఆపుతుందో కానీ.. వైసీపీలోకి వెళ్లాలన్న ఆయన కోరిక తీరడం లేదన్న అభిప్రాయం మాత్రం రాజకీయ వర్గాల్లో ఉంది.

అడిగింది ఇచ్చే వరకు గంటా శ్రీనివాసరావు వైపీపీలోకి వెళ్లబోరన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఆయన అడిగింది ఏంటి? ఆయన అడిగింది ఇవ్వడానికి వైసీపీ ఎందుకు తటపటాయిస్తుందన్నది అంతుచిక్కడం లేదు. కాకపోతే బీజేపీ నుంచి తనకు ఆఫర్‌ ఉందని సంకేతాలు ఇస్తూ వైసీపీతో ఆడుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అప్పుడెప్పుడో సోము వీర్రాజు వెళ్లి గంటాతో భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా విశాఖ వచ్చిన వీర్రాజు సైతం గంట మోగేది ఇక్కడే అని పరోక్ష వ్యాఖ్యలతో హీటెక్కించారు. దీంతో గంటా బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది.

ఇంతలో తన అనుచరులకు చెందిన భూములను కబ్జాల పేరుతో ప్రభుత్వం కూలగొట్టడంతో గంటా శ్రీనివాసరావు విషయంలో అసలేం జరుగుతుందా అన్న ప్రశ్నలు వినిపించాయి. ఏ విషయం త్వరగా తేల్చమనే ఒత్తిడిలో భాగంగానే కూల్చివేతలు అనేవారు కూడా ఉన్నారు. మరి.. యాక్టివ్‌ పాలిటిక్స్‌లో గంట మోగేది ఎప్పుడో ఆయనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version