తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులు పంపింది. మంగళవారం ఉదయం 10:30 గంటలకు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొంది సిబిఐ. అయితే ఈ కేసుని సునీత, సిబిఐ కలిసి తప్పుదోవ పట్టిస్తున్నారని.. వైఎస్ వివేక కి అక్రమ సంబంధాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా అవినాష్ రెడ్డి ఆరోపణలపై స్పందించారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. చంద్రబాబు కుట్ర చేశారని సిబిఐతో అవినాష్ రెడ్డి అంటున్నాడని.. అలా చేస్తే జగన్ పై ఉన్న కేసులను ఎప్పుడో చేయొచ్చు కదా..? అని ప్రశ్నించారు. సిబిఐ దగ్గర ఆధారాలు లేవని అవినాష్ రెడ్డి ఎలా చెబుతారు అని నిలదీశారు. వివేకాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి మంచం కింద దూరి చూశారా..? అంటూ సెటైర్లు వేశారు. వజ్రాల వ్యాపారి భార్యలతో అక్రమ సంబంధాలు ఉన్నాయ్ అంటున్నారని.. ఆ వజ్రాల వ్యాపారితో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు.
ఇంత కంగారుపడుతుంటే హత్య వెనుక సాక్షి యాజమాన్యం ఏమైనా ఉందా..? అనే అనుమానం కలుగుతుంది అన్నారు. వివేకానంద రెడ్డి ఎంత మంచివారో అందరికీ తెలుసన్నారు రఘురామ. పార్టీని నవ్వులపాలు చేసే విధంగా సాక్షి వార్తలు రాస్తుందన్నారు. పార్టీలో కోటంరెడ్డి, ఆనం, శ్రీదేవి కి శాప విమోచనం కల్పించారు.. నాకు కూడా శాపవిమోచనం కల్పించడని కోరారు. జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు చేయరని గతంలో సాయి రెడ్డి చెప్పారని.. అసలు ఎవరు అడిగారని ఆయన అలా చెప్పారని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారని.. రక్తపు మడుగులో ఉంటే గుండెపోటు అని ఎలా చెబుతారు అని నిలదీశారు.