ఓ వైపు మునుగోడు ఉపఎన్నిక ఉంది…మరో వైపు పాతబస్తీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఊహించని విధంగా జరిగిన ఒక సంఘటనతో తెలంగాణ రాజకీయం మునుగోడు టూ పాతబస్తీ వచ్చింది. ఇప్పటివరకు మునుగోడు ఉపఎన్నికపై పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య పెద్ద వార్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలోనే పాతబస్తీలో రచ్చ మొదలైంది…అయితే ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతుందా? ఇందులో రాజకీయ లబ్ది పొందేందుకు ఏ పార్టీ స్కెచ్ వేసిందనేది అర్ధం కాకుండా ఉంది.
ఇదంతా బీజేపీ కుట్ర అని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది…కాదు ఇది టీఆర్ఎస్ కుట్ర అని బీజేపీ అంటుంది. అసలు ఈ రచ్చకు కారణం టీఆర్ఎస్-బీజేపీ పార్టీలే అని కాంగ్రెస్ అంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రచ్చలో కాంగ్రెస్ పాత్ర పెద్దగా లేదనే చెప్పాలి…ఎందుకంటే ఆ పార్టీలోనే పెద్ద రచ్చ నడుస్తోంది.
కాబట్టి ఇలాంటి స్కెచ్ల్లో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేయొచ్చు. అయితే మునుగోడు ఉపఎన్నికలో లబ్ది పొందేందుకు పాతబస్తీలో రచ్చ నడుస్తుందా? లేక ఈ రెండిటికి సంబంధం లేదా? అనేది ఎవరికి క్లారిటీ రావడం లేదు. అయితే ఇందులో ఒకో పార్టీ వర్షన్ చూసుకుంటే…ముందు టీఆర్ఎస్ వర్షన్ చూసుకుంటే…రాజాసింగ్ చేత ఒక మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయించి…తద్వారా పాతబస్తీలో మాట కల్లోలం సృష్టించి దాని ద్వారా రాజకీయ లబ్ది పొందాలనేది బీజేపీ స్కెచ్ అని టీఆర్ఎస్ చెబుతుంది.
ఇక రాజాసింగ్ వ్యాఖ్యలని అడ్డం పెట్టుకుని ఎంఐఎం సహకారంతో పాతబస్తీలో టీఆర్ఎస్ అల్లర్లు సృష్టించిందని, దీని ద్వారా రాజకీయంగా బెనిఫిట్ పొందాలనేది టీఆర్ఎస్ ప్లాన్ అని బీజేపీ అంటుంది. అంటే ఇక్కడ ఎవరి వర్షన్ వారికి ఉంది. కానీ ఇందులో నిజమెంత ఉందనేది ఎవరికి తెలియదు. కానీ పాతబస్తీ ద్వారా…మునుగోడులో లబ్ది పొందాలనే పాయింట్ మాత్రం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.