మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా ట్వి్టర్ వేదికగా.. ఈరోజు మంగళగిరి పట్టణం 22వ వార్డు రత్నాల చెరువు ప్రాంతంలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో పాల్గొని, వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నాను. నిత్యావసర సరుకుల ధరలతో పాటు, జగన్ రెడ్డి పన్ను పోట్లతో అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు చెప్పారు. భావనాఋషి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం… ఇంటింటికి తిరుగుతూ బాదుడే బాదుడు కరపత్రం పంచడం జరిగింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు తెలుగుదేశం పాలనలో నెలకు రూ.4వేలు మిగులు ఉంటే, వైకాపా పాలనలో రూ.9వేలు లోటు ఉంటోందని ప్రజలకు వివరించాను. ఈ సందర్భంగా తారసపడిన రాజేశ్వరి అనే పేదరాలి కుటుంబం… పోలియోతో బాధపడుతున్న తన మూడో కూతురుకు వీల్ చైర్ సాయం చేయాలని కోరడంతో వెంటనే అందిస్తానని మాటిచ్చాను.
అనంతరం ఇటీవల మరణించిన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. రత్నాల చెరువు ప్రాంతంలోని చేనేత మగ్గం షెడ్ల పరిశీలనకు వెళ్ళగా… ప్రతి ఏడాది వర్షాకాలం మగ్గాల్లోకి నీరు రావడం వలన ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని… ఉపాధి లేని సమయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేసారు. ముడిసరుకులైన నూలు, పట్టు, జరీ, రంగుల ఖర్చులు అధికమయ్యాయని… జగన్ రెడ్డి నేతన్న నేస్తం కూడా కేవలం సొంత మగ్గాలు ఉన్న వారికే అందుతోందని నేత కార్మికులు బాధను వ్యక్తం చేసారు. జగన్ రెడ్డి పథకాలన్నీ ప్రచారం కోసం తప్ప ప్రజలకు ఉపయోగపడటం కోసం కాదని వారికి వివరించాను అని పోస్ట్ చేశారు.