ఆ కాంగ్రెస్ సీనియర్లంటే బిజెపికి ఎంత ప్రేమో ?

-

తమ పార్టీలో ఏం జరుగుతోంది అనేదానికంటే, పక్క పార్టీలో ఏం జరుగుతుంది అనే విషయం పైనే  రాజకీయ పార్టీలకు, నాయకులకు ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ ఆసక్తిని కేంద్ర అధికార పార్టీ బిజెపి కాంగ్రెస్ విషయంలో చూపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్లంతా అధిష్టానం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ విషయంలో తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ సైతం కాంగ్రెస్ సీనియర్ లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ముఖ్యంగా సోనియా గాంధీని ఉద్దేశించి సీనియర్ నాయకులు లేఖ రాయడంపై రాహుల్ తీవ్రంగా మండిపడడమే కాకుండా, ఈ లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్లంతా బీజేపీ తో కుమ్మక్కయ్యారు అంటూ ఆరోపణలు చేయడం పెద్ద వివాదాన్ని రేపుతోంది.

ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని రాహుల్ వివరణ ఇచ్చినా, కాంగ్రెస్ సీనియర్లు శాంతించడం లేదు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ లో ఇప్పుడు కలకలం రేగుతుండగా, దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అప్పుడే బిజెపి రంగంలోకి దిగి పోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్లను తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపిస్తూ, వారిపై సానుభూతిని వ్యక్తం చేస్తూ, వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ఆర్ పి ఐ అధినేత రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

కాంగ్రెస్ అభివృద్ధి కోసం సీనియర్ నాయకులంతా ఎంతగానో కష్టపడ్డారని, అటువంటి నాయకులకు విలువ ఇవ్వకపోగా, వారిని అవహేళన చేస్తూ మాట్లాడటం సరికాదని, ఇంకా వారు ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉంటే వారికి గౌరవం దక్కదని, వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరాలని రాందాస్ సూచించారు. ఈ సందర్భంగా రాహుల్ ను ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు. గులాంనబీ ఆజాద్ కపిల్ సిబాల్ బిజెపితో కుమ్మక్కయ్యారని రాహుల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారు వెంటనే పార్టీకి రాజీనామా చేసి బయటికి రావాలని నేను కోరుతున్నాను,  కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం వారు ఎంతో కాలంగా పని చేశారు. ఇకపై వారు ఆ పార్టీని వీడి బీజేపీలోకి చేరే సమయం వచ్చేసింది అంటూ రాందాస్ వ్యాఖ్యానించడంతో రాహుల్ అనుకూల కాంగ్రెస్ వర్గం మండిపడుతోంది.

బిజెపి తమ నాయకులను లాక్కుని, తమ పార్టీని బలహీనం చేయాలని చూస్తోందని మండిపడుతున్నారు. ఇక రాందాస్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా, బిజెపి దేశంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిపోతుందని, వెంటనే కాంగ్రెస్ సీనియర్లంతా బిజెపిలో చేరితే మరింత బలోపేతం అవుతుందని, మీకు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆఫర్లు ఇస్తూ, వారిని ఆకర్షించే పనిలో పడింది. క్రమంగా కాంగ్రెస్ ను బలహీనం చేసి రాహుల్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం ద్వారా, ముందు ముందు తమకు ఎదురు లేకుండా చేసుకునేందుకు బిజెపి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. బిజెపి ఆఫర్ పై కాంగ్రెస్ సీనియర్లు ఏ విధంగా స్పందిస్తారో ?

Read more RELATED
Recommended to you

Latest news