ఇండియాకు చెందిన 16 ఫార్మా కంపెనీలను నేపాల్ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆఫ్రికన్ దేశాల్లో దగ్గు మంతు సిరప్ కారణంగా చిన్నారులు మరణించారన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నేపాల్ మెడిసిన్స్ అథారిటీ బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల వివరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కంపెనీ దివ్య ఫార్మసీ కూడా ఉండటం గమనార్హం. ఈ కంపెనీ పతంజలి బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ జారీ చేసిన జాబితాలో రేడియంట్ పేరెంటరల్స్ లిమిటెడ్, మెర్క్యురీ లేబొరేటరీస్ లిమిటెడ్, అలయన్స్ బయోటెక్, క్యాప్టాబ్ బయోటెక్, అగ్లోమెట్ లిమిటెడ్, జీ లేబొరేటరీస్ లిమిటెడ్, డాఫోడిల్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యెల్జువల్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ పేర్లున్నాయి. కాన్సెప్ట్ ఫార్మాస్యూటికల్స్, ఆనంద్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, ఐపీసీఏ లేబొరేటరీస్ లిమిటెడ్, కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్, డయల్ ఫార్మాస్యూటికల్స్, అగ్లోమెడ్ లిమిటెడ్, మాకుర్ లేబొరేటరీస్ లిమిటెడ్ వంటి బడా కంపెనీలు పేర్లు సైతం లిస్ట్‌లో ఉన్నాయి. ఆయా కంపెనీలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంతోనే కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు డ్రగ్ రెగ్యులేటరి అథారిటీకి చెందిన సంతోకేసీ తెలిపారు.