ఉత్తరాఖండ్ టన్నెల్ కథ సుఖాంతం.. సేఫ్​గా బయటపడ్డ 41 మంది కూలీలు

-

17 రోజులు.. 41 మంది కూలీలు.. కటికచీకటిలో.. సొరంగంలో పురుగూపుట్ర మధ్య.. ప్రాణాలతో బయటపడతామో లేదోనన్న భయం.. సొరంగం బయట 17 రోజులుగా కూలీలను బయటకు తీసుకురావాలన్న సంకల్పంతో రాత్రింబవళ్లు శ్రమించిన అధికారులు.. తమవారు ప్రాణాలతో బయటపడాలని వారి కుటుంబాలు చేసిన ప్రార్థనలు ఎట్టకేలకు ఫలించాయి. ఉత్తరాఖండల్​లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు 17 రోజులుగా అధికారులు చేపట్టిన సహాయక చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. 41 మంది కూలీలు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. యంత్రాలు మొరాయించడం.. సాంకేతిక లోపాలు.. ఇలా అడుగడుగునా అడ్డంకులే ఎదురైనా అధికారులు దృఢ నిశ్చయంతో ముందుకు సాగి కూలీలను బయటకు తీశారు.

వెడల్పైన పైపుగొట్టాలను ప్రవేశపెట్టి నిష్క్రమణ మార్గాన్ని సిద్ధం చేయడంతో మంగళవారం రాత్రి ఒక్కొక్కరుగా కూలీలంతా బయటకు వచ్చారు. తమ కోసం 17 రోజులుగా అలుపెరగకుండా పనిచేసిన యంత్రాంగాన్ని, అధికారుల్ని, క్షేమ సమాచారం కోసం కళ్లుకాయలు కాసేలా నిరీక్షిస్తున్న కుటుంబసభ్యుల్ని చూసి వారు ఉద్వేగానికి లోనయ్యారు. ఘటనాస్థలంలో ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ, కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌, ఇతర ఉన్నతాధికారులకు పాదాభివందనం చేసి చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞత చాటుకున్నారు.

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్‌క్యారా వద్ద సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైన కార్మికుల్లో 41 మంది ఈ నెల 12న అందులో చిక్కుకుపోయారు. సొరంగానికి ఒకపక్క పని పూర్తికాకపోవడం, రెండోవైపు నుంచి రావాలంటే దాదాపు 60 మీటర్ల పొడవునా శిథిలాలు అడ్డుగా ఉండడంతో ఏం చేయాలో అధికారులకు అర్థం కాలేదు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, బీఆర్‌వో, సైన్యంలోని ఇంజినీరింగ్‌ విభాగం, జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వేర్వేరు ప్రత్యామ్నాయాలను పరిశీలించాయి.

సన్నని మార్గం ద్వారా బొగ్గును బయటకు తీసుకువచ్చే నైపుణ్యం ఉన్న కార్మికులు రంగంలో దిగాక అధికారులకు కాస్త ఆశ కలిగింది. చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చే గొట్టపు మార్గం నిర్మాణానికి అడ్డంగా ఉన్నవాటిని వారు విజయవంతంగా తొలగించి.. చిన్నచిన్న పనిముట్ల సాయంతో తవ్వకం ప్రారంభించారు. అలా తవ్వుకుంటూ మంగళవారం రాత్రి సమయంలో కూలీను బయటకు తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version