ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని ట్రాన్స్‌పోర్టు నగర్‌లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఉన్నట్టుండి ఒక్కసారి అంత పెద్ద భవనం నేల కూలడంతో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం జరిగిన ఘటనలో ఐదుగురి మృతదేహాలను బయటకు వెలికి తీశారు. అయితే, సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో మృతదేహాలు కనిపిస్తూనే ఉన్నాయి.
బిల్డింగ్ శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని పోలీసులు, అధికారులు అనుమానిస్తున్నారు. బిల్డింగ్ కూలిన ఘటనలో మరో 28 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. యూపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే బిల్డింగుకు పగుళ్లు ఏర్పడగా భవనం మొత్తం తడిచిపోయి కుప్పకూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు . ప్రస్తుతం క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఇందులో అగ్నిమాపక, సహాయక బృందాలు పాల్గొంటున్నాయి.