అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతోంది. ఈ మేరకు రామ్ జన్మమందిర ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు అతిథులకు ఆహ్వానాలు పంపే కార్యక్రమంలోనూ జోరు పెంచారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, వేద పండితులకు ఆహ్వానాలు పంపారు. మరోవైపు త్వరలోనే సుమారు 7 వేల మంది అతిథులకు ప్రారంభోత్సవ ఆహ్వానాలు పంపనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.
ఇందుకోసం ట్రస్ట్ ప్రతినిధులు, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ వాలంటీర్లు స్వయంగా అతిథులకు ఆహ్వానాలను అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందాయని .. 4 వేల మంది స్వామీజీలను, 50 మంది విదేశీయులను, శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో మరణించిన 50 మంది కర సేవకుల కుటుంబాలను ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు. ఈ నెల 22వ తేదీన జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ప్రధాని మోదీ హాజరవుతున్న విషయం తెలిసిందే. అద్భుత ముహూర్తంలోనే ప్రధాని మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు.