దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.6వేల చొప్పున మోదీ ప్రభుత్వం అందజేస్తున్న విషయం విదితమే. రూ.2వేల చొప్పున మొత్తం 3 దఫాలుగా ఆ సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. అయితే ఈ పథకంలో అతి పెద్ద స్కాం వెలుగు చూసింది. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా అంగీకరించింది.
ఈ పథకం కింద దేశంలోని 42 లక్షల మంది అనర్హులైన రైతులకు రూ.3వేల కోట్లను బదిలీ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్రం వివరాలను వెల్లడించింది. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంపై పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది.
అయితే ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు తాము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని కేంద్రం తెలియజేసింది. ఇక ఎక్కువగా అస్సాంలోనే చాలా మంది అనర్హుల ఖాతాల్లో నగదు జమ అయిందని, ఆ మొత్తం రూ.554 కోట్లుగా ఉందని తెలిపింది. అక్కడ 8.35 లక్షలకు పైగా అనర్హుల ఖాతాల్లో నగదు జమ అయిందని తెలిపారు.
తరువాత రెండో స్థానంలో తమిళనాడు ఉంది. అక్కడ 7.22 లక్షల మంది అనర్హుల ఖాతాల్లో రూ.340 కోట్లు జమ కాగా, పంజాబ్లో 5.62 లక్షల మంది ఖాతాల్లో రూ.437 కోట్లు జమ అయ్యాయి. ఈ క్రమంలోనే మొత్తం రూ.3వేల కోట్లను రికవరీ చేస్తామని కేంద్రం తెలియజేసింది.