ఒకటో తరగతి చదువుతున్న బుడ్డోడు పాఠశాలకు బయలు దేరాడు. మార్గమధ్యలో అతడిని బస్సు ఢీకొట్టింది. అయినా బడికి వెళ్లాడు. తరగతి గదిలో కూర్చున్నాడు. కాసేపటికే అకస్మాత్తుగా అక్కడికక్కడే కూలాడు. వెంటనే స్పందించిన టీచర్లు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ బాలుడిని కాపాడలేకపోయారు. ఈ విషాద ఘటన కర్ణాటక బెంగళూరులోని మున్నెకొల్లులో చోటుచేసుకుంది.
నితీశ్ కుమార్(7) అనే బాలుడు మున్నెకొల్లు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం 9 గంటలకు పాఠశాలకు నితీశ్ వస్తుండగా ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా బాలుడు పాఠశాలకు వెళ్లిపోయాడు. తరగతి గదిలో కూర్చున్నాడు. అయితే కాసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు.
వెంటనే ఉపాధ్యాయులు.. బాలుడిని పాఠశాల సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు నితీశ్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరణకు వచ్చారు. రాజేష్, ప్రియ దంపతుల ఏకైక కుమారుడు నితీశ్. ఘటనాస్థలికి చేరుకున్న హెచ్ఏఎల్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.