బంగ్లాదేశ్లో నెలకొన్న అస్థిర పరిస్థితులను కేంద్రం గమనిస్తోంది. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అఖిలపక్ష నేతలకు వివరించారు. అయితే బంగ్లాలో ప్రమాదకర పరిస్థితులేం లేవని.. అక్కడి నుంచి భారతీయుల్ని తరలించే అవసరం రాదని ఆయన తెలిపారు. అక్కడి పరిస్థితులను అత్యంత అప్రమత్తంగా పరిశీలిస్తున్నామని.. ఏం జరిగినా క్షణాల్లో చర్యలు తీసుకునేలా రెడీగా ఉన్నామని వెల్లడించారు.
మొత్తం బంగ్లాదేశ్లో 12 నుంచి 13వేల మంది భారతీయులు ఉన్నారని జైశంకర్ తెలిపారు. అక్కడ మన ప్రజల భద్రతపై స్థానిక ఆర్మీతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. మానవత్వ చర్యలో భాగంగానే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం కల్పించామని.. భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు కొంత సమయం, కాస్త చోటు కావాలని ఈ క్రమంలోనే ఇక్కడ ఆశ్రయం కల్పించినట్లు జైశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం వదిలివెళ్లిపోవడం వెనక అమెరికా హస్తం ఉందనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.