రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో స్టే ఇచ్చిన పట్నా కోర్టు

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ‘మోదీ’ ఇంటిపేరు కేసులో ఆయనపై దిగువ కోర్టు జారీ చేసిన సమన్లపై పట్నా హైకోర్టు స్టే విధించింది. మోదీ  ఇంటి పేరును కించపర్చారంటూ బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 30న పట్నాలోని ఎంపీ/ ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ ఏప్రిల్‌ 25వ తేదీన తమ ఎదుట వాంగ్మూలం నమోదు నిమిత్తం హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.

వాస్తవానికి మార్చి 18నే ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన పట్నాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు.. ఏప్రిల్‌ 12న రాహుల్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ప్రస్తుతం సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌ వ్యవహారంలో తాము బిజీగా ఉన్నందున విచారణ వాయిదా వేయాలని రాహుల్ న్యాయవాదుల బృందం కోర్టును కోరింది. ఇందుకు అంగీకరించిన కోర్టు.. ఏప్రిల్‌ 25వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ రాహుల్‌ తరపున న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం దిగువ కోర్టు ఆదేశాలపై మే 15వ తేదీ వరకు స్టే విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version