తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయన మాత్రం దానికి అంగీకరించడం లేదు. తాజాగా ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఉదయనిధి మాట్లాడుతూ.. మణిపుర్ హింస, అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ‘మోదీ అండ్ కో’ సనాతన ధర్మం వ్యవహారాన్ని ఓ పావుగా వాడుకుంటోందని మండిపడ్డారు. తాము ఏ మతానికీ శత్రువులం కాదన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో ‘సామాజిక న్యాయం ఎప్పటికీ వర్థిల్లాలి’ అనే శీర్షికతో ఆ ప్రకటన జారీ చేశారు. “పెరియార్, అన్న, కలైంజ్ఞర్, పెరసిరియార్ సిద్ధాంతాలు విజయవంతం అయ్యేలా చూసేందుకు అందరం కలిసి పనిచేద్దాం. బీజేపీ నేతలు నా ప్రసంగానికి వక్రభాష్యం చెప్పారు. గౌరవప్రదమైన పదవుల్లో ఉండి నాపై దుష్ప్రచారం చేసినందుకు అసలు నేనే వారిపై కేసులు పెట్టాలి. కానీ.. ఉనినికి నిలుపుకునేందుకు వారికి ఉన్న మార్గం ఇదేనని నాకు తెలుసు. అందుకే నేను అలా చేయలేదు.” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఉదయనిధి స్టాలిన్.