నేడు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు బిజెపి ఎంపీ లక్ష్మణ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ ఎన్ని బందులు తీసుకువచ్చినా.. రాష్ట్రంలో టిఆర్ఎస్ బందు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని అన్నారు. రాష్ట్రంలో అమలయ్యే జీవోలన్నింటికీ కేంద్రం ఆమోదం ఉందా? అని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికలు వస్తున్నాయని గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
గిరిజనులను మోసం చేసేందుకు కెసిఆర్ రిజర్వేషన్ల నాటకం ఆడుతున్నాడని అన్నారు. రిజర్వేషన్లను పెంచడమే కాకుండా దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని అన్నారు. ఒకవేళ రిజర్వేషన్లు అమలు చేయకపోతే దీనిపై బిజెపి పోరాటం చేస్తుందన్నారు. అవినీతి పార్టీలు అన్నీ ఏకమై వచ్చినా ప్రజలు మోదీ వేపే ఉన్నారని స్పష్టం చేశారు.