మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 3600 కేసులు… ఈ ఒక్కమాట చాలు ముబై రాజధాని వణికిపోడానికి! ఇదే పరిస్థితి మరో రాష్ట్రంలో ఉంటే అక్కడి ప్రజల ప్రవర్తన వేరుగా ఉండేదేమో! కానీ… ముంబై ప్రజలకు ఆ భయం ఎక్కడా ఉన్నట్లుగా లేదు! రోజు రోజుకీ ముంబైలో వస్తోన్న కొత్త కేసులు, నమోదవుతున్న మరణాల గురించి దేశమంతా భయపడుతుంది కానీ… ముంబయి మాత్రం బయపడుతున్నట్లు లేదు! ముంబైలో నమోదవుతున్న మరణాల గురించి వింటుంటే ఇతర ప్రాంతాలవారి గుండె తరుక్కుపోతోంది కానీ… వారికి ఏమీ పట్టినట్లు లేదు! ఈ మాటలకన్నింటికీ కారణం.. తాజాగా ముంబై వాసులు ప్రవర్తించిన ప్రవర్తనే!
అవును… కోవిడ్ – 19 పుణ్యమాని పెళ్లికి పట్టుమని పదిమందిని కూడా పిలుచుకోలేని పరిస్థితి… చివీరి చూపు చూద్దామని అనుకున్నవారికి చావుకి కూడా నలుగురిని పిలుచుకోలేని ఇబ్బంది. ఈ పరిస్థితుల్లో ఈ మహమ్మారి తమను ఏమీ చేయదన్నట్లు గుమిగూడారు ముంబై జనం. అవును… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత చంద్రకాంత్ హందోరే కొవిడ్-19 బారిన పడ్డారు. మహమ్మారి నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న అభిమానులు.. ఆయన కారు దిగగానే ఒక్కసారిగా గుమిగూడి, తన అభిమాన నాయకుడిని తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు ఎగబడ్డారు. ఇదేమన్నా పెళ్లి వేడుకా.. పైగా కరోనా సమయం అయినా కూడా భౌతిక దూరం అనే ఆలోచన వాళ్లకు రాలేదు!
చాలా రోజుల తర్వాత తమ నాయకుడిని చూసే ఆనందమో లేక కరోనా అంటే భయంలేఇ అవగాహనా రాహిత్యమో తెలియదు కానీ.. ఆయన కూడా ఆ వైరస్ నుంచే కోలుకుని వచ్చారన్న విషయం కూడా మరిచిన వారు ఇలా కరోనా భయం లేకుండ ప్రవర్తించారు. మరికొందరైతే ఏకంగా బాణసంచా కూడా కాల్చారు! ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 65వేలు దాటగా.. ముంబయిలో 39 వేలకు చేరువయ్యాయి. 100కు పైగానే మరణాలు సంభవిస్తున్నాయి. అయినా, వీరిలో భయాందోళన కనిపించకపోవడాన్ని ఏమనాలి? వీరి మూర్ఖత్వం తమ అభిమాననాయకుడికి వెల్ కమో కాదో తెలియదు కానీ.. కరోనాకు మాత్రం కచ్చితంగా వెల్ కమే!