ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది గాని తగ్గడం లేదు. ఒక్క రోజులోనే లక్షకు పైగా కరోనా కేసులు నమోదు కావడం తో ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 22 లక్షలు దాటింది. ఇక మరణించిన వారి సంఖ్య కూడా లక్షా 50 వేలు దాటింది. 5.5 లక్షల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. ఇక అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా చుక్కలు చూపిస్తుంది.
అక్కడ ఇప్పటి వరకు 6.77 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే. అక్కడ గురువారం 29 వేలకు పైగా కేసులు నమోదు కావడం తో ట్రంప్ సర్కార్ ఇప్పుడు కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. అక్కడ ఇప్పటి వరకు దాదాపు 35 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఒక్క రోజే దాదాపు 2200 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా మరణాలు పెరుగుతున్నాయి.
బ్రిటన్ లో 861 మంది చనిపోగా… ఫ్రాన్స్‌లో 753 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ లో మళ్ళీ మరణాలు పెరుగుతున్నాయి. నిన్న అక్కడ 525 మంది చనిపోయారు. ఇక స్పెయిన్ లో కూడా మరణాలు పెరిగాయి. 503 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా కరోనా వైరస్ ప్రభావం భారీగానే ఉంది. 13 వేలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మరణాలు 500 మార్క్ దాటే అవకాశాలు కనపడుతున్నాయి.