రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఎన్నో రోజుల నుంచి కనీసమద్దతు ధరపై రైతులు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో కనీస మద్దతు ధరపై కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని కూడా రైతు ఉద్యమం సందర్భంగా కమిటీపై హామీ ఇచ్చారు.
తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కనీస మద్దతు ధరపై కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో ప్రకటించారు.
గతేడాది రైతు ఉద్యమ సమయంలో దేశంలో తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో పాటు… కనీస మద్దతు ధరను డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏడాది తర్వాత స్వయంగా ప్రధాని మోదీనే రైతు చట్టాలు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులకు క్షమాపణలు కూడా తెలిపారు. గత శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు.