పార్టీ ప్రతినిధులకు పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు

-

మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే జనసేన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలనాపరమైన విధివిధానాలు, ప్రజోపయోగ అంశాల మీద మాత్రమే మాట్లాడాలని అధికార ప్రతినిధులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం, టీడీపీతో పొత్తు, తదితర అంశాల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ అధికార ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పార్టీ వైఖరిని అధికార ప్రతినిధులకు వివరించారు. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పులను ప్రస్తావించాలని సూచించారు. కుల, మతాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

జనసేన పార్టీ అధికార ప్రతినిధులకు పవన్ ఏం చెప్పారంటే…

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిధులపై గురుతర బాధ్యత ఉంది. వ్యక్తిగత అభిప్రాయాలకు, దూషణలకు స్థానం లేదు. చర్చల్లో పార్టీ విధివిధానాలకు కట్టుబడి మాట్లాడాలి. అన్ని మతాలను ఒకేలా గౌరవించాలి. దేవాలయాలు, మసీదులు, చర్చిలపై దాడులు జరిగితే ఒకేలా స్పందించాలి. ఒక మతాన్ని ఎక్కువగా చూడడం, ఒక మతాన్ని తక్కువ చేసి మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడే నాయకులను నిలదీయాలి.

టీవీ చర్చల్లో పాల్గొనే వారు సంబంధింత అంశాలపై లోతుగా అధ్యయనం చేసి తగిన సమాచారంతో వెళ్లాలి. టీవీల్లో జరిగే చర్చలను పిల్లలతో సహా కుటుంబ సభ్యులు కలిసి చూసే అవకాశం ఉన్నందున సంస్కారవంతంగా వ్యవహరించాలి. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడినా, తూలనాడినా సంయమనం పాటించండి. ఆ క్షణంలో మనం తగ్గినట్టు కనబడినా… ప్రేక్షకులు, సమాజం దృష్టిలో పెరుగుతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

అవతలి వ్యక్తి రూపురేఖలను ఎట్టి పరిస్థితుల్లోనూ అపహాస్యం చేయొద్దు. వారి ఆహార్యం గురించి మాట్లాడొద్దు. సోషల్ మీడియాలో అనవసరమైన ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకున్నాకే, ఆ సమాచారంపై మాట్లాడడమో, ఆ సమాచారాన్ని జనసేన కేంద్ర కార్యాలయానికి పంపడమో చేయాలి.

సోషల్ మీడియాలో వచ్చే సమాచారంపై స్పష్టత లేనప్పుడు హడావిడి చేయొద్దు. పార్టీ ప్రతినిధులుగా ఉంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టొద్దు. పార్టీ ప్రతినిధులు పార్టీ కోసమే మాట్లాడాలి తప్ప మరెవరి కోసమో మాట్లాడవద్దు. నా సినిమాలు, నా కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై కూడా పార్టీ అధికార ప్రతినిధులు స్పందించవద్దు. అలా స్పందిస్తూ వెళితే మన లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉంది. అని పవన్ కల్యాణ్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version