అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి – పవన్ కళ్యాణ్

-

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌. సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పాతికేళ్లు కూడా నిండని నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందటం చాలా దురదృష్టకరం. ఉద్యోగం కోసం పొట్ట చేత్తో పట్టుకొని రాజధానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు ఈ ప్రమాదంలో అశువులు బాయడం చాలా బాధించింది. కాల్ సెంటర్ లో పనిచేస్తున్న వీరంతా దిగువ మధ్యతరగతి కుటుంబాల వారని తెలిసింది. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఎలా బయటపడాలో తెలియక పొగతో ఉక్కిరిబిక్కిరి అయి చివరకు ఆసుపత్రిలో వీరంతా ప్రాణాలు విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. అనేక కార్యాలయాలు, వాణిజ్య దుకాణాలు ఉన్న స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూలంకషంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలన్నారు.


ఎందుకంటే సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక కాంప్లెక్స్ లో ఇటీవలే ప్రమాదం జరిగి ముగ్గురు మరణించారు. ఇప్పుడు ఈ ప్రమాదం.. ఈ ఘటన మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా? భవన నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడమా అనేది తెలియవలసి ఉంది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి దీనివల్ల అవకాశం కలుగుతుందని భావిస్తున్నాను. తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. వీటి నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కార్యాలయ సముదాయాలు, షాపింగ్ మాల్స్ ను తనిఖీ చేయడంతోపాటు అక్కడి విద్యుత్ లైన్ల నిర్వహణను పరిశీలించాలి. స్వప్న లోక్ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలి. అదే విధంగా కడుపు కోతకు గురైన కుటుంబాల వారికి తగినంత నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను . వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version