మరో పది రోజుల్లో భారీగా పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటిన పెట్రోల్ ధరలు త్వరలో తగ్గుతాయని అంటున్నారు. కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. దీనితో మన దేశంలో పెట్రోల్ ధరలను తగ్గించే యోచనలో ఉంది కేంద్రం. ఇప్పటికే దీనిపై కసరత్తులు కూడా మొదలయ్యాయి.
క్రూడ్ ఉత్పత్తి కోత విషయంలో కీలక దేశాలు రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ ప్రభావం తో బ్యారెల్ చమురు 30 డాలర్లకు పడిపోయింది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా చమురుకి డిమాండ్ తగ్గిపోయింది. ఈ ప్రభావం పెట్రోల్ ధరలపై పడే అవకాశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా కరోనా ఉన్న నేపధ్యంలో క్రూడ్ ఉత్పత్తి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. చాలా దేశాలు దిగుమతి చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నాయి.
మన దేశంలో పెట్రోల్ దాదాపు 65 రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగిందే ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాకు నికర నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా మన చమురు అవసరాల్లో 84 శాతం వరకూ దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.