పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయి.. ఆందోళన అక్కర్లేదు..

-

దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడం ప్రారంభమైనప్పటి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జనాలే కాదు, అటు పరిశ్రమలు కూడా పెరుగుతున్న ఇంధన ధరలకు బెంబేలెత్తిపోతున్నారు. కానీ ఈ పెంపు తాత్కాలికమేనని, త్వరలో పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గుతాయని పలువురు ఆర్థిక వేత్తలు, పారిశ్రామిక రంగ నిపుణులు అంటున్నారు.

petrol and diesel prices will reduce says economists

కరోనా లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దగా ఆదాయం రావడం లేదు. ఎక్సైజ్‌తోపాటు ఇంధన ధరల మీద వచ్చే ట్యాక్సుల ద్వారా ప్రభుత్వాలకు కొంత ఆదాయం అందుతోంది. ఇక పరిశ్రమల కార్యకలాపాలు ఇంకా గాడిలో పడలేదు. అందుకు మరో నెల రోజుల వరకైనా సమయం పడుతుంది. ఆ తరువాత మరో నెల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇతర మార్గాల ద్వారా ఆదాయం లభించడం ప్రారంభమవుతుంది. దీంతో అప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయి. కనుక అప్పటి వరకు మనం వేచి చూడాలి.. అని నిపుణులు అంటున్నారు.

అయితే ఇంధన ధరలు పెరగడం వల్ల అటు పారిశ్రామిక రంగంతోపాటు ఇటు రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. అయినప్పటికీ మరో 3 నెలల్లో ఇంధన ధరలు తగ్గుతాయని.. అందువల్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని అంటున్నారు.

ఇక గణాంకాలు చెబుతున్న ప్రకారం.. భారత్‌లో గత 3 నెలల కాలంలో డీజిల్‌ ధర 22 శాతానికి పైగా పెరిగింది. గత 22 రోజుల్లోనే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.9.17, డీజిల్‌ ధర రూ.11.14 పెరిగింది. జూన్‌ 7వ తేదీ తరువాత మొత్తం 22 సార్లు డీజిల్‌ ధరలను పెంచారు. పెట్రోల్‌ ధరలను 21 సార్లు పెంచారు. దీంతో అనేక చోట్ల డీజిల్‌, పెట్రోల్‌ ధరలు దాదాపుగా సమానంగా ఉండగా, ఢిల్లీలో పెట్రోల్‌ కన్నా డీజిల్‌ ధరే ఎక్కువగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news