రెండు రోజుల అనధికార పర్యటన కోసం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భారత్‌లో అడుగుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన చెన్నై చేరుకున్నారు. చెన్నైకు చేరుకున్న జిన్‌పింగ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఎయిర్ పోర్టులోనే ఘన స్వాగతం పలికారు. అలాగే జిన్‌పింగ్ మాస్కులు ధరించిన సుమారు 2 వేల మంది విద్యార్థులు ఎర్రటి టీషర్టులు ధరించి.. భారత్, చైనా జాతీయ జెండాలతో చైనా అధినేతకు స్వాగతించారు.
విమానాశ్రయం నుంచి జిన్‌పింగ్ గిండిలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు బయల్దేరివెళ్లారు. కాగా, జిన్‌పింగ్ సాయంత్రం 4 గంటలకు మహాబలిపురానికి చేరుకుంటారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే మహాబలిపురానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక అక్కడ మోదీ ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరగనున్న రెండో అనధికార సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది.