పోలవరం ప్రాజెక్టు వల్ల సంభవించే ముంపు సమాచారానికి సంబంధించిన విషయంలో జరుగుతున్న జాప్యం విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), ఆంధ్రప్రదేశ్ తీరును తెలంగాణ తీవ్రంగా ఆక్షేపించింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిల్వ మట్టం మేరకు నీళ్లను నిల్వచేస్తే ముంపు ప్రభావాన్ని గుర్తించే ఉమ్మడి సర్వేను వర్ష్షాకాలానికి ముందే జరపాలని డిమాండ్ చేసింది. ఇందుకు అనుగుణంగా ఈ నెల 15న ప్రత్యక్ష సమావేశం నిర్వహించాలని కోరింది.
ముంపుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏపీ, తెలంగాణతో బుధవారం సాయంత్రం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే ముంపు సమాచారాన్ని తెలంగాణ అధికారులు ఈ నెల 6నే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అందించారు. అయితే అథారిటీ ఆంధ్రప్రదేశ్ అధికారులకు 12న మధ్యాహ్నం 2 గంటలకు అందజేసింది. ఈ కారణంగా ఏపీ అధికారులు సమయం కోరారు. దీంతో తెలంగాణ అధికారులు అసహనం వ్యక్తం చేశారు.
పోలవరంతో తెలంగాణలో ముంపునకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే పలుమార్లు అథారిటీకి అందించామని, అక్కడి నుంచి ఏపీకి సమాచారం చేరిందని.. అయినా జాప్యం చేస్తున్నారంటూ తెలంగాణ అధికారులు ఆక్షేపించారు. సమావేశంలో తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ దేవేందర్‌రావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, చీఫ్ ఇంజినీర్ ఏ.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ కె.వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఎస్.సుబ్రహ్మణ్యప్రసాద్ హాజరయ్యారు.