ఏపీలో సరికొత్త రాజకీయం..కులాల తోకలతో కొత్త పిలుపులు

-

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. వీళ్లంతా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇవే పేర్లతో పరిచయం. తమ నాయకులపై అభిమానం ఎక్కువైతే సీఎం జగన్‌ అని పిలుచుకుంటారు వైసీపీ కార్యకర్తలు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను సైతం పవన్‌ అనే సంభోదించేవాళ్లు ఉన్నారు. ఇక చంద్రబాబు అయితే మొదటి నుంచి టీడీపీ వాళ్లకు.. వైరి పక్షాలకు.. ప్రజలకు.. చంద్రబాబుగానే పరిచయం. కానీ.. ఇవే పిలుపులు ఇప్పుడు రాజకీయ నాయకుల నోటి నుంచి సరికొత్తగా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులు కారణంగా పేర్లకు తోకలు తగిలించి వ్యంగ్యంగా పలికేవారు ఎక్కువయ్యారు. ఈ విషయంలో వాళ్లూ వీళ్లు అని తేడా లేదు. అంతా ఒకే దారిలో వెళ్తున్నారు. ప్రత్యర్థులను కొత్తగా పిలుస్తున్నారు… పేర్ల వెనక తోకలు తగిలిస్తున్నారు. ఈ విషయంలో వెనకపడతామనుకున్నారో ఏమో అన్ని పక్షాలు అదే లైన్‌ ఎంచుకున్నాయి. ఒకప్పుడు అలా పలకడానికే ఇష్టపడని వారు సైతం గళం సవరించుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

సీఎం జగన్‌ను విపక్షాలు జగన్‌రెడ్డి అని సంభోదిస్తున్నాయి. టీడీపీ, జనసేన నాయకులు ఇలా కావాలనే పిలుస్తున్నారన్నది జనాలకు అర్థమవుతోంది. ఇలాంటి విమర్శలపై కొన్నాళ్లు ఓపిక పట్టిన వైసీపీ నాయకులు.. మేమైనా తక్కువ తిన్నామా అని వారు కూడా టీడీపీ, జనసేన అధినేతల పేర్లకు తోకలు తగిలించేశారు. చంద్రబాబును చంద్రబాబు చౌదరి అని.. పవన్‌ కల్యాణ్‌ను పవన్‌ నాయుడు అని పిలవడం మొదలుపెట్టారు. అధికార పార్టీ నాయకులు ఇలా ఒకరినొకరు విమర్శించుకునే సమయంలో పేర్ల చివరిలో తోకలను నొక్కి పలకేందుకు ఏ ఒక్కరు వెనకాడటం లేదు. ఆయా నేతల సామాజికవర్గాలను తెలియజేయాలనే అలా విమర్శిస్తున్నారని జనాలకు అర్ధమవుతున్నా.. ఓ లాజిక్‌ మాత్రం మిస్‌ అవుతున్నారు.

వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతల సామాజికవర్గాలేంటో ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందరికీ తెలిసిందే. కానీ.. నేతల పలికే తీరే కొంత ఎబ్బెట్టుగా ఉందన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సీఎం జగన్‌ను జగన్‌రెడ్డి అంటూ తొలుత అన్నది జనసేనాని పవన్‌. వైసీపీ ప్రభుత్వంలో ఒక వర్గానికే ప్రాధాన్యం దక్కుతుందని చెప్పడానికి జనసేన అధ్యక్షుడు ఈ వైఖరిని ఎంచుకున్నారు. విషయం అర్థమైన తర్వాత అధికార పార్టీ నేతలు కూడా పవన్‌ నాయుడు అని జనసేనానికి కొత్త పేరు పెట్టేశారు. ఇటీవల కాలంలో సీఎం జగన్‌ను జగన్‌రెడ్డి అని పిలవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పోటీ పడుతున్నారు.

అమరావతి రైతుల 365 రోజుల నిరసనసభకు హాజరైన చంద్రబాబు.. ఇలాంటి విమర్శలే చేసి టీడీపీ నేతలను, అధికార పక్షాన్ని ఆశ్చర్యపరిచారు. గతంలో సీఎం జగన్‌ను చంద్రబాబు ఎప్పుడూ అలా పిలిచిన సందర్భాలు లేవు. నారా లోకేష్‌, టీడీపీ నేతలు తమ ట్వీట్లలో ఈ తరహా విమర్శలు చేస్తూ ఉండేవారు. చంద్రబాబు విమర్శలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి అధికారపక్షం ఆలస్యం చేయలేదు. మీడియా ముందుకు వచ్చిన మంత్రి పేర్ని నాని అదే లైన్‌ ఎంచుకున్నారు. చంద్రబాబును చంద్రబాబు చౌదరి అని పేరు చివర నొక్కి పలికారు.

గతంలో చంద్రబాబు సామాజిక పరమైన అంశాలపై స్పందించడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. తనకంటూ ఒక పరిధి విధించుకునేవారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సామాజికవర్గాన్ని సీఎం జగన్‌ ప్రస్తావించినప్పుడు టీడీపీ నేతలు అభ్యంతరాలు తెలిపారు. ఒక సీఎం అలా ఎలా అంటారని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే లైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ కొత్త పంథా టీడీపీకి ఎంతవరకు కలిసి వస్తుందో కానీ.. చంద్రబాబు తన పరిధిని చెరిపేసుకోవడం చర్చకు దారితీస్తోంది. మరి.. మూడు పార్టీల ప్రధాన నాయకులు ఇక్కడితో ఆగుతారో.. అలా పిలవడం తప్పులేదన్నట్టుగా ప్రవర్తిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news