గ్రేటర్‌లో కాంగ్రెస్ నేతల కయ్యాలు..ఇంఛార్జ్ ఠాగూర్ గయాబ్

-

కాంగ్రెస్ పార్టీ అంటే కయ్యాలు… కాలు దువ్వడాలు… ఆ పార్టీ నేతలకు అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. అంటే… గొడవలు… గాలబా.. రుసరుసలు… విసవిసలు… ఆ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. పార్టీ బాగున్నప్పుడు ఏం చేసినా నడిసింది. కానీ ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీదాకా నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో నేతలంతా కలుపుకొనిపోవడం మానేసి కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. వరస ఎన్నికల ఓటమితో నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్‌లో అయినా పరువు నిలబెట్టుకోవలన్నా ధ్యాసే లేకుండా పోయింది.

చింత సచ్చినా.. పులుపు చావలేదు అన్నట్టు ఉంది కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు. అసలే పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇలాంటప్పుడు అంతా కలిసి పోరాడాల్సింది పోయి.. ఎవరి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి దారి వారు వెతుక్కుంటున్నారు. పార్టీకి గడ్డుకాలం అని తెలిసినా నాయకుల్లో మాత్రం ఐక్యత కనిపించడం లేదు. గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల సమయం సరిపోదని చెప్పే కాంగ్రెస్… అభ్యర్థుల ఎంపిక కోసం వేసిన కమిటీలు మాత్రం నాయకుల మధ్య విభేదాలతో ఆఖరి నిమిషం వరకూ తేల్చలేదు. సిటీ ప్రెసిడెంట్ గా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ తో రచ్చ మొదలైంది. తనకు చెప్పకుండా కమిటీలు ఎలా వేస్తారని అడిగిన అంజన్… తనవరకు వచ్చేసరికి అంతా నేనే అనుకుంటే ఎలా..? అని ప్రశ్నిస్తోంది పార్టీ.

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జీలు కూడా ఉన్నారు. వాళ్లకు సంబంధం లేకుండా… ఆయా నియోజకవర్గాల్లో ఉన్న డివిజన్ అభ్యర్థులను అంజన్ ఎలా ఎంపిక చేస్తారు అనే విమర్శలు వచ్చాయి. గోషామహల్ నియోజకవర్గంలో… అటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో సీట్ల పంచాయతీ మొదలైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ముఖేష్ కొడుకు విక్రమ్ ఆరు డివిజన్లలో అభ్యర్థుల జాబితా ఇచ్చారు. దాంట్లో రెండు డివిజన్లలో తాను సూచించిన వారికే సీటు ఇవ్వాలని అంజన్ పట్టుబట్టారు. మరోపక్క జూబ్లీహిల్స్‌లో పీజేఆర్‌ కుమారుడు విష్ణు… తన నియోజకవర్గంలోని డివిజన్ల బీఫారాలు పంపిస్తే.. ఎవరికి ఇవ్వాలో తామే ఇచ్చుకుంటామని చెప్పేశారంటా. ఇలా ఉంది నేతల పరిస్థితి.

అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్.. ముషీరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. అక్కడ రెండు డివిజన్లలో అభ్యర్థుల కోసం పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి సూచించారట. అయితే తన నియోజకవర్గంలో వేరే వాళ్లు వేలు పెట్టడం ఎంటని అనిల్ అభ్యంతరం తెలిపారు. సొంత నియోజకవర్గంలో ఇతరులు వేలు పెట్టొద్దని అనుకునే అంజన్… ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎందుకు వేలు పెడుతున్నారని… విక్రమ్ ప్రశ్నించారు.

మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ తో సీనియర్ కాంగ్రెస్ నేతలను కమలం గూటికి చేరుస్తుంది.ఇంత రచ్చ జరుగుతున్నా… రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్ పత్తా లేకుండా పోయారు. అన్ని రాజకీయ పార్టీల ఇంఛార్జీలు వచ్చి పార్టీ నాయకులతో సంప్రదింపులు జరపడం… నాయకులకు దిశా నిర్దేశం కూడా చేస్తున్నారు. నామినేషన్ల గడువు ముగిసిపోయే సమయానికి కూడా ఠాగూర్ రాలేకపోయారు. ఇలాగైతే పార్టీ ఎలా ఎన్నికల్లో విజయబావుటా ఎగరేస్తుందనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news