మస్ట్ రీడ్: ఏపీ రాజకీయాల్లో… చర్య – ప్రతి(కార)చర్య!

-

ప్రతీచర్యకూ ప్రతిచర్య ఉంటుంది.. ఇది సృష్టి ధర్మం! ప్రస్తుతం ఈ ధర్మం ఏపీ రాజకీయాల్లో క్రమం తప్పకుండా అమలవుతుంది! చంద్రబాబు చర్యలకు జగన్ సర్కార్ నుంచి వడ్డీతో కూడిన ప్రతిచర్యలు జరుగుతున్నాయి! ఇది ఎంతదూరం పోతుంది.. ఇది ఎంతవరకూ మంచిది.. రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే.. రాజకీయాలు కాస్త ప్రజాసేవకంటే ఎక్కువగా ప్రతీకారచర్యలకు వేదికలుగా మారనున్నాయి!

chandrababu naidu ys jagan

వివరాళ్లోకి వెళ్తే… రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మల రామానాయుడుకు సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకూడదని ప్రివిలేజ్ కమిటి నిర్ణయించినట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో లిక్కర్ షాపుల సంఖ్య విషయంలో అచ్చెన్నాయుడు.. సామాజిక పింఛన్ల విషయంలో రామానాయుడు మాట్లాడిన సమయంలో సభలో తప్పుడు లెక్కలు ఇచ్చారని వైసీపీ ఎంఎల్ఏలు ఆరోపించారు.

దీంతో వీరిద్దరిపైన చర్యలు తీసుకోవాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి – శ్రీకాంత్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదుచేశారు. తనకు వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ప్రివిలేజ్ కమిటికి పంపారు. ఇదే విషయమై తాజాగా సమావేశమైన కమిటీ ఇద్దరిపైనా చర్యులు తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై స్పందించిన రామానాయుడు… తమకు రెండున్నరేళ్ళ పాటు సభలో మాట్లాడకుండా మైక్ ఇవ్వకూడదని కమిటి తీసుకున్న నిర్ణయం అన్యాయమని మొత్తుకుంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… ఏపీ ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా ప్రతిచర్యే అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పుడు అన్యాయం అన్యాయం అని చెబుతున్న టీడీపీ నేతలు ఒకసారి వెనక్కి వెళ్తే… టీడీపీ హయాంలో ఎమెల్యే రోజాను సభలోకి రానీకుండా ఏడాదిపాటు సస్పెండ్ చేశారు! ఒక ఎమ్మెల్యేని సభలోకి రాకుండా ఏడాదిపాటు సస్పెండ్ చేయటం ఏ రూల్ బుక్ ప్రకారం చూసిన సాధ్యంకాదు! అయినా కూడా నాడు రోజా విషయంలో బాబు & కో అంతలా ఎందుకు ప్రవర్తించారు.

అప్పట్లో తనపై సస్పెన్షన్ అన్యాయమని రోజా ఎంత మొత్తుకున్నా… అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్, చంద్రబాబునాయుడు ఏమాత్రం పట్టించుకోలేదు. “సభ నిర్ణయం తీసుకుంది.. తాను అమలు చేశానంతే” అని స్పీకర్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు! నాడు అది సరైన చర్య అయితే… నేడు జగన్ చేస్తుంది కూడా సరైన చర్యే! నాడు చంద్రబాబు రోజాపై కక్ష సాధిస్తే… నేడు జగన్ కూడా ఇద్దరు నాయుళ్లపై కక్ష సాధిస్తున్నట్లే!

వీరి చర్య – ప్రతిచర్యల రాజకీయాలు ఇలానే నడిస్తే.. రేపటి రోజున రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది సులువుగా అర్ధమయ్యే విషయమే! అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా రోజాపై చర్యలు తీసుకునేటపుడు చంద్రబాబు కాస్త ముందు వెనుక ఆలోచించాల్సింది. కానీ… బాబు & కో ఆ పని చేయలేదు. ఫలితంగా రాజకీయాల్లో హుందాతనం పోయింది!

కాబట్టి “ప్రతీచర్యకు ప్రతి(కార)చర్య ఉంటుంది” అనే విషయం చంద్రబాబు అయినా జగన్ అయినా గ్రహించాల్సిందే! కానీ.. ఇలాంటి ప్రతి(కార)చర్యల రాజకీయాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఇద్దరూ గ్రహించాలి! అధికారం ఉంది కదా అని నాడు బాబు చేసిన పనికి నేడు ప్రతిఫలం వచ్చేసింది. జగన్ కి కూడా రేపు ఇదే పరిస్థితి రావచ్చు… టీడీపీకి “రేపు” అనేది ఉంటే!!

Read more RELATED
Recommended to you

Latest news