జగన్ మరో ట్విస్ట్: నాలుగు ప్రాంతీయ మండళ్ళు?

ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వచ్చిన రెండేళ్లకు అంటే ఇప్పుడు మూడు రాజధానులపై ట్విస్ట్ ఇచ్చారు. మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంటున్నట్లు జగన్ ప్రకటించారు. అలాగే మెరుగైన బిల్లుతో మళ్ళీ ముందుకొస్తామని చెప్పి మరో ట్విస్ట్ ఇచ్చి వదిలిపెట్టారు. ఇక దీని వెనుకే మండలి రద్దు నిర్ణయంపై కూడా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

jagan
jagan

ఇలా ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ ఇస్తున్న జగన్ ప్రభుత్వం…తాజాగా మరొక ట్విస్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళని ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. గతంలోనే దీనిపై జగన్ ప్రభుత్వం ఆలోచన చేసింది…కానీ దీనిపై ముందుకెళ్లలేదు. ఇప్పుడు మూడు రాజధానులని రద్దు చేసిన నేపథ్యంలో మండళ్ళని ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యారట. గతంలో అనుకున్న విధంగానే… త్వరలోనే 13 జిల్లాల కోసం నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు కానున్నాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కోసం అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కోసం విశాఖ కేంద్రంగా ఒక మండలి ఏర్పాటు కానుంది. ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాల కోసం రాజమండ్రి వేదికగా మరో మండలి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

అటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ అభివృద్ధి మండలి ఒంగోలు కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు కర్నూలు కేంద్రంగా మరో మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయా జిల్లాల్లోని అభివృద్ధి వ్యవహారాలు మొత్తం ఈ మండళ్ల ద్వారానే నిర్వహించే విధంగా మండలి పాలక వర్గాల రూప కల్పన జరుగుతోంది. ఈ మండళ్ళ ఛైర్మన్ బాధ్యతలని స్థానికంగా ఉండే సీనియర్ నేతలకు అప్పగించనున్నారని తెలుస్తోంది. అలాగే మండలిలో స్థానిక ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది. మరి ఈ ప్రాంతీయ మండళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చూడాలి.