ఏపీ రాజకీయాల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని త్వరగా రాజధాని గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారంలో ఉండి కూడా వైసీపీ నేతలు విశాఖ రాజధాని అనే డిమాండ్ పై పోరాటం చేయడాన్ని ప్రజలు నమ్ముతున్నారో లేదో చెప్పలేని పరిస్తితి. సరే ఆ విషయం పక్కన పెడితే..అడపాదడపా మంత్రులు త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని, విశాఖ రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు.
ఇక ధర్మాన ఓ అడుగు ముందుకేసి..విశాఖని రాజధానిగా చేయాలని లేదంటే ఉత్తరాంధ్రని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు విశాఖని రాజధానిగా చేసుకుంటామని అంటున్నారు. అయితే ధర్మాన చేస్తున్న ఈ వ్యాఖ్యలు వైసీపీలోనే కలకలం రేపుతున్నాయి. కానీ ధర్మాన వ్యాఖ్యలు వెనుక జగన్ ఉన్నారా? లేక ధర్మాన సొంతంగా మాట్లాడుతున్నారా? అనే క్లారిటీ రావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇదే సమయంలో ధర్మాన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించారు. విశాఖను రాజధాని చేయకపోతే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న మంత్రి ధర్మాన డిమాండ్‌పై బీజేపీ నేతలు స్పందిస్తూ.. మంత్రి ధర్మాన ప్రత్యేక రాష్ట్రం అడగడం వెనుక ఉద్దేశ్యం ఏంటని..దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారా ? అని ప్రశ్నిస్తున్నారు.
ఇది మీ ప్రభుత్వ నిర్ణయమా.. ధర్మాన అభిప్రాయమా చెప్పాలని.. ఒకవేళ ధర్మాన అబిప్రాయం అయితే ధర్మానను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారా అని వైసీపీని ప్రశ్నించారు. మరి ధర్మాన డిమాండ్ పై అటు వైసీపీ నేతలు ఎవరు స్పందించలేదు..ఇటు ప్రతిపక్ష టీడీపీ నేతలు సైతం స్పందించలేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో స్పందిస్తారేమో.