తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ లో ఆధిపత్య పోరు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆత్మీయ సమావేశాల్లో పెద్ద ఎత్తున నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఇదే క్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నేతల మధ్య రచ్చ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మద్య రాజకీయ యుద్ధం నడుస్తుంది. ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నిస్తున్నారు.
అయితే కేపి వివేకా…టిడిపి నుంచి బిఆర్‌ఎస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. 2014లో టిడిపి నుంచి గెలిచి బిఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. 2018లో బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి మరోసారి గెలిచారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా సీటు దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని వివేకా చూస్తున్నారు. కానీ ఆయన ఆశలకు శంభీపూర్ బ్రేకులు వేస్తున్నారు. ఈయన సైతం నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. వివేకాకు ధీటుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో వివేకాకు సీటు విషయంలో పెద్ద తలనొప్పి ఎదురవుతుంది.
కాకపోతే ఇప్పటికే సిట్టింగులకే సీటు అని కేసిఆర్ ప్రకటించారు. కానీ సరిగ్గా పనిచేయని వారికి సీటు ఇవ్వనని చెప్పేశారు. అయితే ఎమ్మెల్యే వివేకా పనితీరు మెరుగ్గానే ఉంది..ఈ క్రమంలో వివేకాని కాదని శంభీపూర్ రాజుకు సీటు ఇస్తారనేది చెప్పలేం. కానీ ఇక్కడ బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వివేకాకు సీటు ఇస్తే శంభీపూర్ వర్గం సహకరించే పరిస్తితి ఉండదు. ఇప్పటికే రెండు గ్రూపులుగా పార్టీ చీలిపోయింది.
ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ లో బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం తప్పదని చెప్పవచ్చు. చూడాలి మరి ఈ సారి కుత్బుల్లాపూర్ లో ఎలాంటి పరిస్తితి ఉంటుందో.