చంద్రబాబు నిర్ణయం.. ప‌త‌నం దిశ‌గా తెలుగు దేశం పార్టీ

-

రాజకీయ చాణ‌క్యుడు, దేశ రాజ‌కీయాల‌ను శాసించిన చంద్రబాబుకి ఇప్పుడు ఏమైంది. ఎన్నిక‌ల‌ను బ‌హిష్కరిస్తున్నామంటూ చేసిన ప్రక‌ట‌న టీడీపీ త‌మ్ముళ్లను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. పార్టీ నిర్ణయంపై టీడీపీ అభ్యర్థులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వ‌రకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత మంది పార్టీని వీడిపోయినా తెలుగు దేశం పార్టీ ప‌ఠిష్ఠంగా ఉండ‌టానికి గ‌ల కార‌ణం కింది స్థాయి కార్యక‌ర్తలే. అలాంటి కార్యక‌ర్తల‌ను కోల్పోయే ప‌రిస్థితి చంద్రబాబు త‌నాంత‌ట తానుగా తీసుకువ‌స్తున్నారా ఇంతకీ పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలన్న చంద్రబాబు నిర్ణయం తప్పటడుగా…పార్టీ పతనం దిశగా వెళ్తుందా అన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.

పరిషత్‌ ఎన్నికల బహిష్కరణపై టీడీపీలో భిన్న స్వరాలు వినిస్తున్నాయ్‌. పార్టీ నిర్ణయంపై టీడీపీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోటీలో ఉంటామని స్పష్టం చేస్తున్నారు కార్యకర్తలు. పొలిట్ బ్యూరో తో పాటు అన్ని వర్గాలను సంప్రదించిన మీదటే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నా దీనిపై పార్టీ సీనియర్ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వ‌రుస ఓట‌ముల‌తో కృంగిపోతున్న టీడీపీ కార్యక‌ర్తల‌ను ఈ నిర్ణయం మ‌రింత నిరాశ క‌లిగించింది. టీడీపీని వీడి ఎంతో మంది నేతలు బయటకు వెళ్లినా పార్టీ తట్టుకుని నిలబడిందంటే దానికి కారణం పార్టీకి కిందిస్తాయి నుంచి ఉన్న కార్యకర్తల బలమే. ఈ విషయం చంద్రబాబు మరిచారా అని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ఈ ప్రకటన చేశారో లేదో ఏపీ టీడీపీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అనుకున్నవారు ఒక్కొక్కరుగా పార్టీ నిర్ణయానికి భిన్నంగా గళం విప్పారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో గతంలో ఈ స్థాయి ఏకగ్రీవాలు లేవని లెక్కలు చెబుతుంది టీడీపీ. ఈ లెక్కలు ఎలా ఉన్నా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో సీనియర్ల అభిప్రాయాన్ని చంద్రబాబు తీసుకున్నారా..వారితో మాట్లాడారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలా సంప్రదించి ఉంటే ఇప్పుడు పార్టీ లైన్‌కు భిన్నంగా ఇంత మంది నేతలు మాట్లాడేవారు కాదు కదా అని పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారట.

జ్యోతుల నెహ్రూ, అశోక్‌గజపతిరాజు, హనుమంతరాయ చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తి ఇలా సీనియర్లంతా పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ సందర్భాలలో అసెంబ్లీ, లోక్‌సభ ఉపఎన్నికలను గతంలో టీడీపీ బహిష్కరించింది. కానీ ఇవి క్షేత్రస్థాయిలో బలాన్ని నిరూపించుకునే ఎన్నికలు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఆలోచించినా.. కిందిస్థాయిలో మాత్రం కొన్ని పంతాలు పట్టింపులు ఉంటాయి. ప్రతిష్టగా తీసుకుని పోటీ చేస్తారు. చావో రేవో అన్నట్టుగా పోరాడతారు. ఇప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయం కారణంగా లోకల్‌గా ఏం చేయాలో పాలుపోని స్థితిలో కేడర్‌ ఉంది. అందుకే చాలా చోట్ల పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు నాయకులు.

చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటి చేసిన మంగళగిరి వంటి ప్రాంతాల నుంచి అక్కడి మండల నాయకులు పోటీలో ఉన్నామని ప్రకటించారు. ఈ సమస్య ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు
టీడీపీలో కాక పుట్టిస్తుంది. జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌ను బ‌హిష్కరిస్తున్న బాబు..మ‌రి తిరుప‌తిలో ఎందుకు పోటీ చేస్తున్నట్లు..పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎందుకు పోటీ చేసిన‌ట్లు..అనే ప్రశ్నలు ప్రతిప‌క్షాల‌నుండి మాత్రమే కాదు. సామాన్య టీడీపీ కార్యక‌ర్తల మెద‌ళ్ళను తొలుస్తున్న ప్రశ్నలు. టీడీపీని ప్రేమించి పార్టీకోసం పోరాడుతున్న కార్యక‌ర్తల‌కు ఎదుటి పార్టీ నాయ‌కుల నుండి ఎదుర‌య్యే వెక్కిరింపులు ఊహించడం పెద్ద క‌ష్టమేమీ కాదు.

తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ తీవ్ర గందరగోళంలో ఉన్న సమయంలో కూడా బాబు ఎన్నికల విషయంలో వెనుకడగు వెయ్యలేదు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అనేక ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేసింది. ఓటమి ఎదురైనా చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ప్రత్యర్థులకు అధికార బలం ఉన్నా వెనక్కి తగ్గలేదు. అయితే ఆ నాటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకోవడం పై చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల బహిష్కరణ అనేది టిడిపిలో పెద్ద తుఫాన్ నే రేపుతోంది. మరి.. సమస్యను పార్టీ అధినేత ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news