సీఎం చంద్ర‌బాబు, లోకేష్ లు ఇద్ద‌రూ జైలుకు వెళ్లాలి: జ‌గ‌న్

-

సీఎం చంద్ర‌బాబు డేటా చోరీ అంశాన్ని త‌ప్పు దోవ ప‌ట్టించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య గొడ‌వ‌గా దీన్ని చిత్రీక‌రిస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబు సైబ‌ర్ నేరస్థుడ‌ని వైకాపా అధినేత జ‌గ‌న్ అన్నారు. ఏపీలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న డేటా చౌర్యం కేసు విష‌య‌మై జ‌గ‌న్ ఇవాళ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ… ఆధార్ కార్డు, ఓట‌ర్ ఐడీ వివ‌రాలు టీడీపీ యాప్ సేవా మిత్ర‌లో ఎలా వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించారు. అవి కేవ‌లం ఆయా సంస్థ‌ల వ‌ద్దే ఉంటాయ‌ని, అలాంటి ప్రైవేటు వ్య‌క్తుల చేతిలో ఆ వివ‌రాలు ఎలా ఉంటాయ‌ని అన్నారు. రాష్ట్రమే కాదు, దేశ చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ ఇలాంటి సైబ‌ర్ నేరం జ‌ర‌గ‌లేద‌న్నారు. ఇది అనుకోకుండా జ‌రిగింది కాద‌ని, ప‌క్కా ప్లానింగ్‌తో చేశార‌ని, గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి ఈ స్కాం న‌డుస్తుంద‌ని జ‌గ‌న్ అన్నారు.

ప్ర‌జ‌ల బ్యాంక్ అకౌంట్ వివ‌రాలు టీడీపీ సేవా మిత్ర యాప్‌లోకి ఎలా వ‌చ్చాయ‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. టీడీపీకి వ్య‌తిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ఉండే వారి ఓట్ల‌ను తొల‌గించేందుకే ఈ స్కాం చేశారని ఆరోపించారు. 2018 సెప్టెంబ‌ర్ నెల‌లో ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసిన ఓట‌ర్ల జాబితాను తాము పూర్తిగా ప‌రిశీలించామ‌ని, అప్పుడు 56 ల‌క్ష‌ల న‌కిలీ ఓట్లు ఉన్నాయ‌ని, దానిపై కేసు వేసి ఆధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించామ‌న్నారు. కానీ జ‌న‌వ‌రి 2019లో వ‌చ్చిన మ‌రో ఓట‌ర్ల జాబితాను గ‌మ‌నిస్తే అందులో మ‌రో 3 ల‌క్ష‌ల న‌కిలీ ఓట్లు పెరిగాయ‌ని తెలిపారు. దీనిపై కూడా తాము ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

డూప్లికేట్ ఓట్ల మీద ఫాం 7 ద్వారా ఫిర్యాదు చేస్తే అదేదో త‌ప్పు అన్న‌ట్లుగా ఏపీ ప్ర‌భుత్వం మాట్లాడ‌డం స‌బ‌బు కాద‌ని జ‌గ‌న్ అన్నారు. ఫాం 7 ద్వారా ఫిర్యాదు చేసిన వారి మీద‌కు ఏపీ పోలీసుల‌ను పంపి వేధిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అస‌లు ఫాం 7 కి, ఏపీ ప్ర‌భుత్వానికి సంబంధం ఏముంది ? అని ప్ర‌శ్నించారు. ఇది ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు సంబంధించిన అంశ‌మ‌న్నారు. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటు కంపెనీల‌కు ఇచ్చార‌ని, దానిపై కేసు పెట్టాల‌ని జ‌గ‌న్ కోరారు. చంద్ర‌బాబు, లోకేష్ లు ఇద్ద‌రూ జైలుకు వెళ్ల‌ద‌గిన నేర‌స్తుల‌ని అన్నారు. సీఎం చంద్ర‌బాబు డేటా చోరీ అంశాన్ని త‌ప్పు దోవ ప‌ట్టించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య గొడ‌వ‌గా దీన్ని చిత్రీక‌రిస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. దీనిపై కూడా తాము మ‌రోసారి కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి ఫిర్యాదు చేస్తామ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news