దిశ ఆంశం లోక్‌సభను కుదిపేసింది. దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఆ ఆంశం ఇప్పుడు దేశ పార్లమెంట్‌ను కుదిపేసింది. దిశ సంఘటనను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చర్చకు లేవనెత్తింది. లోక్‌సభలో జీరో అవర్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రంజన్ చౌదరి ఈ ఆంశాన్ని లేవనెత్తారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దిశ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో పోలీసులు నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసి హతమార్చడాన్ని చూసి కేంద్రంలోని ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. మహిళల రక్షణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ పోలీసుల తీరును చూసి ఇతర రాష్ట్రాల ఖాకీలు నేర్చుకోవలసింది ఎంతయినా ఉందన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న ఈ తరుణంలో సీతలను కాల్చేస్తున్నారని ఆయన ఆవేశంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు చెందిన మరో ఎంపీ ప్రతాపన్ సభ వెల్ లోకి దూసుకువఛ్చి.. ఏవో నినాదాలు చేస్తుండగా ఆ పార్టీ ఎంపీలు, ఎన్సీపీ సభ్యులు కొంతమంది ఆయనను వెనక్కి లాగేశారు అటు-యూపీలోని ఉన్నావ్ లో ఓ రేప్ బాధితురాలిపై కొంతమంది కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనను మరికొంతమంది సభ్యులు ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని వారు నిలదీశారు. ఇలా సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయడం, బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతో స్పీకర్ ఓం బిర్లా సభకు వాయిదా వేశారు. తరువాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. విపక్ష సభ్యుల తీరును తప్పు పట్టారు. ప్రధానంగా అధిర్ రంజన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పిన అమె ప్రతి అంశాన్నీ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, వీటికి మతం రంగును పులుముతున్నాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ లోని మాల్టా లో ఉన్నావ్ కేసు వంటిదే జరిగితే సభ్యులు మాట్లాడడం లేదెందుకని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.
అయితే లోక్‌సభను దిశ సంఘటన ఓ కుదుపు కుదపగా, పలువురు మహిళా అధినాయకురాల్లు, ఎంపీలు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. దిశ కేసులో కాస్త ఆలస్యం జరిగినా న్యాయమే గెలిచిందన్నారు. యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి హైదరాబాద్ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. యూపీ పోలీసులు తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోవాలని హితువు పలికారు. యూపీలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయని, యూపీలో అటవిక రాజ్యం నడుస్తుందని, ఇక్కడ కూడా దిశకు జరిగిన న్యాయం జరిపేలా యూపీ సీఎం చొరవ తీసుకోవాలని అన్నారు. మొత్తానికి తెలంగాణ పోలీసులు దిశ సంఘటనలో దేశ వ్యాప్తంగా హీరోలుగా నిలిచారు.