రాజీనామా చేయను.. నన్ను సస్పెండ్ చేసుకోండి: డీఎస్

-

కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగి చివరకు పార్టీలో సరైన ప్రాధాన్యం లభించక టీఆర్ఎస్ బాట పట్టాడు డీఎస్(డీ శ్రీనివాస్). టీఆర్ఎస్ లో చేరడానికి డీఎస్ చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను టీఆర్ఎస్ లో చేరుతా అని డీఎస్ గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినా సరే కేసీఆర్ మాత్రం ఆ ప్రతిపాదనను కొన్ని రోజుల వరకు నాన్చుతూ వచ్చాడు. తర్వాత డీఎస్ ను పార్టీలోకి తీసుకోవడం.. రాజ్యసభ పదవి ఇప్పించడం చకచకా జరిగిపోయాయి. అయితే.. టీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ నుంచి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడైతే టీఆర్ఎస్ లో చేరాడు కానీ.. ఆయన వల్ల పార్టీ ఒరిగిన ప్రయోజనమైతే ఏదీ లేదని టీఆర్ఎస్ నాయకులు చాలా సార్లు వాపోయారట.

సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం డీఎస్ కు, సీఎం కేసీఆర్ కు పొసగట్లేదు. దానికి కారణాలు అనేకం. తన ఇద్దరు కొడుకులు కావచ్చు.. నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకులపై ఆయన ఎదురుదాడి చేస్తున్నారన్న ఆరోపణలు కావచ్చు.. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాడని కావచ్చు.. అనేక కారణాలతో డీఎస్ ను పార్టీ హైకమాండ్ పక్కన బెట్టింది. ఎంపీ కవిత కూడా డీఎస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాడని నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ కు లేఖ రాసింది.

మళ్లీ సీన్ కట్ చేస్తే.. మంగళవారం మీడియాతో మాట్లాడిన డీఎస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పార్టీని వదిలి వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. పార్టీని వదిలి వెళ్తే తన మీద వచ్చిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్టేనని .. అందుకే తనంతట తాను రాజీనామ చేయబోనని అన్నాడు. అయితే.. అధిష్ఠానమే తనను సస్పెండ్ చేయాలని కోరాడు. అదీ చేతకాకపోతే.. తాను టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చానని తనపై చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అసలు ఏవిధంగా తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేశానో వెల్లడించాలని డీఎస్ పార్టీ హైకమాండ్ ను డిమాండ్ చేశాడు. దీంతో నిజామాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి. తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని చెప్పాడు డీఎస్. తెలంగాణ పట్ల తనకు ఎంతో నిబద్ధత ఉందన్నారు. చివరగా.. తన కుమారుడు బీజేపీలో చేరడం అతడి సొంత నిర్ణయమని.. దాంట్లో తన పాత్ర ఏమీ లేదని తేల్చి చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news