నిమ్మగడ్డ తీరుపై ఏపీ ఐఏఎస్‌ అధికారుల్లో ఆసక్తికర చర్చ

-

ప్రభుత్వం వర్సెస్‌ ఎస్‌ఈసీ అన్నట్టుగా ఉన్న ఏపీలో వ్యవహరం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ క్రమంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తీరుపై ఏపీ ఐఏఎస్‌ అధికారుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మీద రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కాలు దువ్వినట్టు వ్యవహరిస్తుండడాన్ని ఐఏఎస్సులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసుకునే క్రమంలో నిమ్మగడ్డ అనుసరిస్తున్న తీరును నిశితంగా గమనించడంతో పాటు ఐఏఎస్‌ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఏపీలో రెండు ప్రధాన వ్యవస్థల మధ్య ప్రత్యక్షంగానే యుద్దం జరుగుతోంది. ప్రభుత్వం మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కాలు దువ్వడం.. ప్రభుత్వం కూడా ఎస్‌ఈసీ విషయంలో అంతే పట్టుదలతో ఉండడంతో ఏపీలో ఎస్‌ఈసీ కేంద్రంగా రాజకీయం రసకందాయంలో పడుతోంది. ప్రభుత్వం మీద ఈ స్థాయిలో విరుచుకుపడే ఐఏఎస్ అధికారి ఇటీవల కాలంలో ఎవ్వరూ లేరనే చెప్పాలి. గతంలో రిటైరయ్యాక వైఆర్ కృష్ణారావు, విధుల్లో ఉండగానే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వ్యవహరించిన గోపాలకృష్ణ ద్వివేది అప్పటి ప్రభుత్వాలతో కాస్తో కూస్తో హాట్ హాట్‌ వ్యవహరాలు నడిచినా.. అది లిమిటెడ్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహరం మరింత ముదిరింది. ప్రస్తుతం ఏపీలో ఎస్‌ఈసీ సెంట్రిక్‌గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఫక్తు పొలిటికల్‌ డ్రామా మూవీ నడిచినట్టే కన్పిస్తోంది.

ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఐఏఎస్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. సీఎస్‌ నీలం సాహ్నీకి ఎప్పుడెప్పుడు లేఖలు రాస్తారు..? ఆ లేఖల్లో ఏమేం ఉంటాయనేది ఐఏఎస్‌ వర్గాలు ముందుగానే చెప్పేస్తున్నాయట. ఈ నెల 17వ తేదీన నిమ్మగడ్డ రాసిన లేఖ.. ఆ తర్వాత తాజాగా 23వ తేదీన రాసిన మరో లేఖ గురించి కొందరు ఐఏఎస్సులు ముందుగానే చెప్పేశారట. ఏ రోజున లేఖ రాస్తారు..? ఆ లేఖలో ఏమేం ఉంటాయనేది కూడా చెప్పేస్తున్నారట. దీనికి తగ్గట్టుగానే ఎస్‌ఈసీ కూడా అదే తరహాలో లేఖలు సంధిస్తున్నారట.

అయితే ఇదేదో ఇంటెలిజెన్స్‌ సమాచారం ద్వారానో.. వేరే మార్గాల్లోనో సమాచారం రప్పించుకుని లేఖలు రాస్తారని సదురు ఐఏఎస్సులు చెప్పలేదట. కేవలం నిమ్మగడ్డ గత కొంత కాలంగా వ్యవహరిస్తున్న తీరును.. కరోనా కేసుల సంఖ్యను బేరీజు వేసుకుంటే నిమ్మగడ్డ ఏం చేయబోతున్నారనేది ఇట్టే చెప్పేయొచ్చని ఐఏఎస్‌ వర్గాలు చమత్కరించుకుంటున్నట్టు తెలుస్తోంది. శెలవు దినాల్లోనూ.. ఆదివారాల్లోనూ కరోనా టెస్టుల శాంపిల్స్‌ తక్కువగా ఉంటాయి. ఆదివారాలు కానీ.. శెలవు రోజులు కానీ వస్తే మర్నాడు ఇచ్చే బులెటిన్‌లో కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. ఇటీవల నిమ్మగడ్డ రాసిన రెండు లెటర్లు.. వీకెండ్స్‌ తర్వాత రాసిన లేఖలననే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు ఐఏఎస్ లు.

ఇటీవల ఎస్‌ఈసీ నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్‌ విషయంలో కొందరు కలెక్టర్లు.. జిల్లా స్థాయి అధికారుల మధ్య ఇదే తరహాలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినప్పుడు.. దానికి వెళ్తే ఒక తంటా.. వెళ్లకుంటే మరో తంటా అన్నట్టుగా ఉండేదని కొందరు అధికారులు వాపోయారట. ఎస్‌ఈసీ విషయంలో తమ పరిస్థితి పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టుగా ఉందని కొందరు ఐఏఎస్సులు చర్చించుకుంటున్నారట. అయితే రెండు సార్లూ వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయింది కాబట్టి సరిపోయిందని.. అలా కాకుండా ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఉంటేనా.. అంటూ తెగ చర్చించుకుంటున్నాయట ఐఏఎస్ వర్గాలు. ఈ క్రమంలో ఈ ఎపిసోడ్‌కు వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్‌ పడితే బెటరనే భావన సదురు ఐఏఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇక ఈ మొత్తం ఎపిసోడ్‌ నుంచి తామెలా లాభం పొందాలా..మంత్రులు, ప్రభుత్వం గుడ్‌ లుక్స్‌లో తాము ఏ విధంగా ఫోకస్‌లోకి రావాలా.. అనే కోణంలోనూ ఆలోచన చేసే అధికారులు ఉన్నారట. ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని.. ప్రభుత్వంతో ఈ విధంగా పంతాలకు పోవడం దేనికంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తీరును తప్పుపడుతూ కొందరు ఐఏఎస్సులు పలువురు మంత్రుల వద్ద అదే పనిగా ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. ఈ విధంగా ప్రస్తావించడం ద్వారా తాము ప్రభుత్వానికి.. సదురు మంత్రులకు లాయల్‌గా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం ఆ తరహా ఐఏఎస్సులు కన్పిస్తోందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎస్‌ఈసీ కేంద్రంగా విధులు నిర్వహించే ఓ అధికారి ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నిమ్మగడ్డ తీరుపై ఐఏఎస్ సర్కిల్‌లో మాత్రం ఆసక్తికర చర్చే జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news